టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మైదానంలో గొడవకుదిగే ప్రతిసారీ తాను ఆపేవాడినని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(gautam gambhir yuvraj singh) అన్నాడు. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లిద్దరి ఫొటో ఒకటి అభిమానులతో పంచుకొని ఇలా రాసుకొచ్చాడు. 'థాంక్ గాడ్. మన ఇద్దరి మొహాల్లో చిరునవ్వులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రజలంతా.. నేనేదో కొట్లాడటానికి వెళ్తుంటే నువ్వు నన్ను వెనకనుండి ఆపుతున్నట్టు పొరబడేవారు' అని పోస్టు చేశాడు.
దీనికి స్పందించిన మాజీ ఛాంపియన్ 'నువ్వు మైదానంలో కొట్లాడటానికి సిద్ధమైన ప్రతిసారి నేను ఇలాగే చేయాల్సి వచ్చేది' అని సరదాగా కామెంట్ చేశాడు. కాగా, గంభీర్ టీమ్‌ఇండియాలో ఆడే రోజుల్లో తన బ్యాటింగ్‌తో అదరగొట్టడమే కాకుండా అప్పుడప్పుడు దూకుడుగా ఉంటూ ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బుదలిచ్చేవాడు. మరీ ముఖ్యంగా ఒకసారి పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో(gautam gambhir shahid afridi) సై అంటే సై అనేలా కనిపించాడు. దీంతో అప్పటి నుంచీ వారిద్దరి మధ్య అప్పుడప్పుడు మాటలతూటాలు పేలుతుంటాయి. అలా గంభీర్ ఒక్కోసారి తన ప్రశాంతత కోల్పోయేవాడనే ఉద్దేశంలో యువీ సరదాగా కామెంట్ చేశాడు.