Yuvraj Singh Birthday : యువరాజ్ సింగ్, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన డేరింగ్ బ్యాటర్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు యూవీ తన అద్భుతమైన ప్రదర్శనతో గట్టెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన యూవీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించిన యువరాజ్ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ మాజీ దిగ్గజం మంగళవారం (డిసెంబర్ 12) 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనీ కంటె ముందు కెప్టెన్ కావాల్సిన యువరాజ్ ప్లేయర్‌గానే ఎందుకు మిగిలిపోయాడు? దానికి కారణాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
Sachin Tendulkar Greg Chappell Controversy :2007లో వెస్డిండీస్ వేదికగా వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరిగింది. ఈ వరల్డ్‌కప్ లో టీమ్ఇండియా లీగ్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ కారణంగా వరల్డ్ కప్ ఆడిన సీనియర్లంతా అదే ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఆరంభ ఎడిషన్‌కు దూరమయ్యారు. తనకంటే సీనియర్ అయిన సెహ్వాగ్ కూడా జట్టులో లేడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న యువరాజ్ సింగ్ కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే ఇదే సమయంలో 'క్రికెట్ గాడ్' సచిన్ తెందూల్కర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ మధ్య నెలకొన్న వివాదం తలెత్తింది. దీంతో అతికొద్ది మంది టీమ్ఇండియా తరఫు ప్లేయర్ల సచిన్‌కు మద్దతునిచ్చారు. అందులో యూవీ కూడా ఉన్నాడు.
'టీమిండియాకు సారథ్యం వహించాలనే ఆకాంక్ష నాకు చాలా బలంగా ఉండేది. నిజానికి నాకు సారథ్య బాధ్యతలు దక్కాల్సింది. కానీ గ్రేగ్ చాపెల్-సచిన్ తెందూల్కర్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఆ ఛాన్స్ మిస్ అయింది. సచిన్‌కు మద్దతు ఇచ్చిన వారిలో నేను కూడా ఉన్నాను. అయితే యూవీ, సచిన్‌కు మద్దతు పలకడం బీసీసీఐలో కొంత మంది పెద్దలకు నచ్చలేదు. దాంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారని బోర్డులోని నా సన్నిహితులు చెప్పారు. అయితే అది ఎంతవరకు నిజమో అప్పుడు తెలియలేదు. కానీ అనూహ్యంగా నన్ను తప్పించి 2007 టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ బాధ్యతలు ధోనీకి అప్పగించారు' అని యూవరాజ్ గతంలో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.