పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి నిర్ణయాన్ని అయిష్టంగానే ఒప్పుకున్నట్లు వెల్లడించింది. రాజీనామా వెనక గల కారణం మాత్రం తెలియలేదు.
జూన్ 25 నుంచి జులై 20 వరకు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది పాక్ జట్టు. అక్కడు 3 వన్డేలతో పాటు 3 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత అటునుంచి అటే విండీస్ టూర్‌కు వెళ్లనుంది. జులై 21 నుంచి ఆగస్టు 24 వరకు ఐదు టీ20లతో పాటు రెండు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొననుంది.
బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాకిస్థాన్ జట్టు యూకే టూర్‌కు వెళ్లనుంది. విండీస్ పర్యటన నాటికి యూనిస్ స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉంది. అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఇదీ చదవండి:ఇల్లు గడవడానికి క్యాబ్ డ్రైవర్‌గా మారిన క్రికెటర్
తన పాత్ర పట్ల సంతోషంగా లేని కారణంగానే ఈ పదవి నుంచి యూనిస్ వైదొలిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ జాతీయ జట్టు భవిష్యత్‌పై అతడు అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పదవికి గతేడాది నవంబర్‌లో ఎంపికయ్యాడు. 2022 టీ20 ప్రపంచకప్ వరకు బ్యాటింగ్ కోచ్‌గా అతనికి సమయముంది.
యూనిస్ రాజీనామాపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ స్పందించారు. మంచి నిపుణుడి సేవలు కోల్పోతున్నామని తెలిపారు. తామిద్దరి వరుస చర్చల తర్వాతనే యూనిస్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. ఇష్టం లేనప్పటికీ స్నేహపూర్వకంగానే అతని రాజీనామాకు అంగీకారించాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్‌లో అతడు బోర్డుతో తన ఆలోచనలు పంచుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.
పాక్ బోర్డు వల్లేనా?
అయితే యూనిస్ నిర్ణయం వెనక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హస్తం పరోక్షంగా ఉందని తెలుస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు పాక్ శిక్షణ శిబిరంలోకి మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్‌ను అనుమతించింది పీసీబీ. ఈ నిర్ణయంతో సంతృప్తి చెందని యూనిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.
ఇది కొత్తేం కాదు..
పాకిస్థాన్ క్రికెట్లో టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో యూనిస్ కూడా ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి సమస్యలతో సతమతమవుతుండేవాడు. పీసీబీ ఛైర్మన్‌తో కలవడానికి సమయం లేదనే కారణంతో 2007 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్సీని వదులుకున్నాడు. అటు తర్వాత కొంత కాలానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. 2009లో అతని కెప్టెన్సీపై జట్టులోని కొందరు ఆటగాళ్లు ఫిర్యాదులు చేశారు. కెరీర్ చివరలో పీసీబీ ఇచ్చిన నగదు పురస్కారాన్ని కూడా అతడు తిరిగి ఇచ్చేశాడు.
ఇదీ చదవండి:WTC Final: ఆలస్యంగా ప్రారంభమైన ఐదోరోజు ఆట