Yashasvi Jaiswal Man Of The Match :యువ సంచలనం యశస్వి జైశ్వాల్ తన ఆట తీరుతో అందరిని అబ్బురపరుస్తున్నాడు. తొలుత దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన జైస్వాల్.. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో తాజాగా టీమ్ఇండియా స్టార్ క్రికెటర్స్‌తో వెస్టిండీస్‌కు పయనమయ్యాడు. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జైస్వాల్.. తాజాగా జరిగిన టెస్టు, టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో పలు రికార్డులను తన ఖాతాలోకి వేసుకుంటున్నాడు.
తన అంతర్జాతీయ కెరీర్లో జైశ్వాల్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఆడిన నాలుగింటిలోనూ రెండు మ్యాచ్‌ల్లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో నెట్టింట ఇతని పేరు ట్రెండింగ్ అవ్వడంతో పాటు.. పలువురు మాజీలు అతడిపై ప్రసంశల జల్లును కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా జైస్వాల్‌ను కొనియాడారు. జైశ్వాల్ రీసెంట్ ఇన్నింగ్స్.. తనకు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపిన ఆయన..నాలుగో టీ20లో అతడు మ్యాచ్‌ను ముగించిన తీరు తనను ఆకర్షించిందంటూ చెప్పుకొచ్చాడు.
Akash Chopra About Yashasvi Jaiswal : "జైశ్వాల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. టీమ్ఇండియా జెర్సీని ధరించిన తర్వాత అతనికి ఇది నాలుగో మ్యాచ్ మాత్రమే. రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు. అందులో తొలి టెస్టులోనే 171 పరుగులు బాది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తర్వాత మొదటి టీ20లో త్వరగానే పెవిలియన్ చేరుకున్నప్పటికీ. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆఖరి దాకా క్రీజులో ఉండి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా అతను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. అలా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అదరగొట్టిన జైశ్వాల్.. టీమ్ఇండియా తరఫున కూడా తనను తాను నిరూపించుకుంటున్నాడు. అతడు స్టార్ కాదు, ఓ సూపర్ స్టార్. ఫ్యూచర్లో టీమ్ఇండియాకు మూడు ఫార్మాట్లలో జైస్వాల్ కీలకంగా మారడం అందరం చూస్తాం " అని ఆకాశ్ కొనియాడారు.
Jaiswal International Career : వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జైశ్వాల్... మొదటి టెస్టులోనే ఓపెనర్‌గా అవకాశాన్ని అందుకున్నాడు. అలా టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో171 పరుగులతో సత్తా చాటాడు. మరో మూడు టెస్ట్ ఇన్నింగ్స్‌లో . ఓ శతకం, ఓ అర్ధశతకం సహా 266 పరుగులు చేశాడు. ఆ తర్వాత వన్డేల్లో జైశ్వాల్‌కు అవకాశం రాలేదు. దీంతో టీ20ల్లోనైనా అతడిని జట్టులో తీసుకోవాలంటూ నెట్టింట డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో మూడో టీ20లో బ్యాట్ పట్టిన జైస్వాల్..ఆ మ్యాచ్‌లో అతడు ఒక పరుగుకే వెనుదిరిగాడు. అయినప్పటికీ నిరాశ చెందకుండా నాలుగో టీ20లో అర్ధశతకంతో సత్తా చాటాడు.