ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియాపై న్యూజిలాండ్ గెలుపొందింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన కోహ్లీని.. ఓటమికి బాధ్యుడిగా చేస్తూ పలువురు అతన్ని నిందిస్తున్నారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్లు భారత కెప్టెన్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ ఓటమికి కోహ్లీ ఒక్కడినే ఎందుకు నిందిస్తారని ప్రశ్నించాడు మాజీ క్రికెటర్ అరుణ్‌లాల్. ఇది జట్టు వైఫల్యమని తెలిపాడు.
"విరాట్ ఔటైనా షాట్.. అంత చెత్తగా ఏమి లేదు. ఆ బంతిని బౌండరీకి తరలించాలనే ఉద్దేశంతో కోహ్లీ ఆడాడు. కానీ, పొరపాటుగా అది ఎడ్జ్ తీసుకుంది. దీంతో అతడు పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో అతడు బాగానే ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 57 పరుగులు చేశాడు. కోహ్లీ ఫుట్‌వర్క్ బాగానే ఉంది. విరాట్ ఔటైన బాల్‌కు అతని కాళ్లకు తగిన దూరంలోనే ఉంది. అతడి అనంతరం క్రీజులోకి వచ్చిన వారంతా విఫలమయ్యారు. అంటే ఇది జట్టు వైఫల్యం. దానికి కోహ్లీని ఒక్కడినే నిందిస్తే ఎలా?"
-అరుణ్‌లాల్, మాజీ క్రికెటర్.
"విరాట్ క్రీజులోకి వచ్చినప్పుడు అతడిపై చాలా ఒత్తిడి ఉంది. ఆ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. తొలి ఇన్నింగ్స్‌లో ఎల్బీగా ఔటైన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. నిజం చెప్పాలంటే జేమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతడి బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం" అని అరుణ్‌లాల్ అభిప్రాయపడ్డాడు.