తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వన్డే ప్రపంచకప్‌లోనూ మూడు ఫైనల్స్ పెట్టమంటావా రోహిత్​?'

WTC Final Rohit Sharma : డబ్ల్యూటీసీ ఫైనల్​ బెస్టాఫ్ త్రీ ఫార్మాట్‌లో నిర్వహించాలన్న టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ వ్యాఖ్యలను భారత మాజీలు తప్పుపడుతున్నారు. వన్డే ఫైనల్‌ను కూడా బెస్ట్ ఆఫ్ త్రీ ఫార్మాట్‌లో ఆడించాలా? అని హర్భజన్ సింగ్.. రోహిత్​ను ప్రశ్నించాడు. భజ్జీ ఇంకేమన్నాడంటే?

WTC Final Rohit Sharma
WTC Final Rohit Sharma

By

Published : Jun 12, 2023, 7:00 PM IST

WTC Final Rohit Sharma : ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెస్టాఫ్ త్రీ ఫార్మాట్‌లో నిర్వహించాలని టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు భారత దిగ్గజ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సునీల్ గావస్కర్ కూడా రోహిత్ ప్రతిపాదనను తప్పుబట్టారు. బెస్టాఫ్ త్రీ గురించి మాట్లాడేవారు భవిష్యత్తులో బెస్ట్ ఆఫ్ ఫైవ్ ఆడించాలని డిమాండ్ చేస్తారని సునీల్ గావస్కర్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. వన్డే ఫైనల్‌ను కూడా బెస్ట్ ఆఫ్ త్రీ ఫార్మాట్‌లో ఆడించాలా? అని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.

"డబ్ల్యూటీసీ ఫైనల్‌ను బెస్ట్ ఆఫ్ త్రీ ఫార్మాట్‌లో ఆడించాలంటున్న రోహిత్‌కు నా సూటి ప్రశ్న ఏంటంటే..? వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా మూడు మ్యాచ్‌లు ఆడించాలా? ఐపీఎల్‌లో కూడా ఒక ఫైనలే ఉంటుంది కదా..? ఒకవేళ ఇప్పుడు టీమిండియా స్థానంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లే ఉండి ఉంటే రోహిత్ శర్మ ఈ ప్రతిపాదన చేసేవాడా? నాకు తెలిసి ఇలా మాట్లాడేవాడు కాదు. అప్పుడు ఒక్క ఫైనల్ మాత్రమే చాలు అనేవాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌తో పాటు టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ ఒకటే ఫైనల్ ఉంటుంది. టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి మెగా ఈవెంట్లలో కూడా ఒకటే ఫైనల్ ఆడిస్తారు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో బెస్టాఫ్ త్రీ కాకపోతే బెస్టాఫ్ ఫైవ్ కూడా ఆడవచ్చు. కానీ ఐసీసీ ఫైనల్ అంటే ఒక్కటే ఉండాలి. ఒక్క టెస్టు మ్యాచ్ చూసేందుకే జనాలు ఆసక్తి చూపించడం లేదు. అలాంటిది మూడు మ్యాచ్‌లు ఎవరు చూస్తారు?"

-- హర్భజన్ సింగ్, భారత మాజీ క్రికెటర్​

'మూడు కాకపోతే 16 మ్యాచ్​లు పెట్టమనండి"
మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్​ ప్యాట్ కమిన్స్ సైతం రోహిత్ ప్రతిపాదనపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "మేం ఇప్పటికే డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలుచుకున్నాం. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను 3 మ్యాచ్‌ల సిరీస్‌తో కాకపోతే 16 మ్యాచ్‌ల సిరీస్‌‌తో నిర్వహించమనండి. ఒలింపిక్స్ ఫైనల్లో కూడా ఒకే మ్యాచ్‌తోనే ఆటగాళ్లు పతకాలు సాధిస్తారు" అంటూ కమిన్స్ వ్యాఖ్యలు చేశాడు.

ఇదే తొలిసారి కాదు..
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఫార్మాట్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన రావడం ఇదే తొలిసారి కాదు. డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్​లో న్యూజిలాండ్ చేతిలో టీమ్​ఇండియా ఓడిన తర్వాత అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. కానీ ఐసీసీ పట్టించుకోలేదు. ఆ దిశగా బీసీసీఐ కూడా ఎలాంటి ఒత్తిడి చేయలేదు. దాంతో అంతా మరిచిపోయారు. మళ్లీ ఇప్పుడు రోహిత్​ వ్యాఖ్యలతో నెట్టింట ఇదే చర్చ జరుగుతోంది. కాగా, వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్​కు చేరుకున్న టీమ్​ఇండియా.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ABOUT THE AUTHOR

...view details