AUS vs IND WTC Final: టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరింది. తొలి డబ్ల్యూటీసీలో జరిగిన ఫైనల్స్‌లో న్యూజిలాండ్ విజయం సాధించగా.. ఈ సారైనా భారత్ విజేతగా నిలవాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అంత తక్కువగా అంచనా వేయలేం. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు దూకుడుగా ఆడే బ్యాటర్లు.. పేస్ ఎటాక్‌తో కూడిన బౌలర్లు ఇలా ఎన్నో బలాలు ఆ జట్టు సొంతం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జరగనున్న తుది పోరులో ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఎవరున్నారో ఓసారి చూద్దామా..
విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా.. వీరందరూ టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ల లిస్ట్‌లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌తో సంబంధం లేని ఆటగాడు. తనదైన రోజున ఎలా ఉన్నా మైదానంలో చెలరేగిపోతాడు. ఇక ఐపీఎల్‌లో సెంచరీలతో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. ఇంగ్లాండ్‌కు చేరాడు. అయితే, ఆసీస్ ఆటగాళ్లను ఎంతగానో కలవరపెడుతున్నారు విరాట్-ఛెతేశ్వర్ ద్వయం. వీరిద్దరి ఆటకు ఆసిస్ జట్టు ఏ మేరకు భయపడుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికి ఆసీస్‌పై ఉన్న రికార్డే దానికి కారణం.
WTC Final Team India : పుజారా కౌంటీల్లో ఆడిన అనుభవం ఈ డబ్ల్యూటీసీకి అక్కరకొస్తుంది. అలాగే డబ్ల్యూటీసీ సైకిల్లో (2021-23) భారత్ తరపున బ్యాటింగ్ చేసిన వారిలో ఉత్తమ ప్రదర్శన చేసిన తొలి ఇద్దరు ఆటగాళ్లు కూడా పుజారా (887 పరుగులు), కోహ్లీ (869)నే. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు క్రీజ్‌లో పాతుకుపోయినా.. భారత్‌కు భారీ స్కోరు రావడం అనేది ఖాయం ఇక. చాన్నాళ్ల తర్వాత టీమ్ఇండియాలోకి అడుగు పెట్టిన అజింక్య రహానె.. ఈ మ్యాచ్‌ల్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కీపర్ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఇషాన్, కేఎస్ భరత్.. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనేది మేనేజ్‌మెంట్‌కు పెద్ద సమస్యగా మారిన అంశం.
WTC Final Team Australia : మరోవైపు టెస్టు ఫార్మాట్‌లో ఆడనున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్‌లో దూకుడుగా ఆడకపోయినప్పటీకీ.. తన ఫామ్ తిరిగివచ్చేలా ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే అతడి ఓపెనింగ్ పార్టనర్ ఉస్మాన్ ఖవాజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక జట్టులో ఉన్న స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఉండనే ఉన్నారు. పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఈ సారి తమ జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడని ఆసీస్ శిబిరం భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను త్వరగా ఔట్ చేయగలిగితే.. మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించే అవకాశాలు చాలా ఉంటాయి.