సౌథాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో లంచ్ సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(112 బంతుల్లో 19 పరుగులు), గ్రాండ్ హోమ్(4 బంతుల్లో 0 పరుగులు) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో ఇషాంత్ 2, షమి 2, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మరింత రసవత్తరంగా మారింది.
ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగిన కేన్ సేన వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యమిస్తుంటే.. కోహ్లీ సేన అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. పరుగులు రాక కివీస్ బ్యాట్స్మెన్లు నానాతంటాలు పడుతున్నారు. 24 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కివీస్ 34 పరుగులు మాత్రమే చేసింది.
ఓవర్‌నైట్ స్కోరుకు మరో 16 పరుగులు జోడించాక రాస్ టేలర్(37 బంతుల్లో 11 పరుగులు) వికెట్‌ను కోల్పోయింది కివీస్. షమి బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బంతిని ఒడిసిపట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్ డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చాడు. 70వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఇషాంత్.. నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. స్లిప్స్‌లో రోహిత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వాట్లింగ్‌ను క్రీజులో కుదురుకోక ముందే వెనక్కి పంపాడు షమి. మంచి ఇన్‌స్వింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పొచ్చు.