టీమ్ఇండియా టెస్టు జట్టులోకి మ్యాచ్ విన్నర్లను తీసుకొస్తానని కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యుత్తమ జట్టుతోనే ఆడామని, అనుకున్న దాని కంటే 30-40 పరుగులు తక్కువ చేయడం వల్ల న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినట్లు పేర్కొన్నాడు. బుధవారం పూర్తయిన ఫైనల్లో ఓటమి అనంతరం విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడిందని కోహ్లీ ప్రశంసించాడు. మ్యాచ్ ఆసాంతం తమపై ఒత్తిడి తీసుకొచ్చి, విజయం సాధించారని అన్నాడు. ఈ గెలుపునకు వారు అర్హులని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్, ఆటకు గుండెచప్పుడు లాంటిదని, ఈ టోర్నీ నిర్వహించాలనే ఐసీసీ ఆలోచన మంచిదని కోహ్లీ చెప్పాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ అనేది తమకు ప్రత్యేక విజయమని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. తమ జట్టులో స్టార్లు లేకపోయినప్పటికీ కలిసికట్టుగా ఆడి గెలిచామని చెప్పాడు. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో తొలి ఐసీసీ ప్రపంచ టైటిల్ దక్కించుకోవడం గొప్ప అనుభూతి అని విలియమ్సన్ తెలిపాడు.