తొలిసారి జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో(WTC Final) గెలిచేందుకు టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయని, ఇలాంటి గొప్పపోరులో భాగమైనందుకు అవి సంతోషంగా ఉంటాయని మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్(Ajith Agarkar) పేర్కొన్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనేది గొప్ప విశేషమని, అందులో ఏ ఆటగాడైనా తనదైన ముద్రవేస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పాడు. అలాంటివే ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయని అభిప్రాయపడ్డాడు.
"ఈ మ్యాచ్‌లో ప్రత్యేక మైలురాయి చేరుకున్న తొలి ఆటగాడినే ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. అదే ఈ ఫైనల్‌ను ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇందులో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా ఒకానొక స్థితిలో 360 పాయింట్లతో అన్ని జట్లకన్నా చాలా ముందంజలో ఉండేది. అయితే, విజయాల శాతం ప్రకారం ర్యాంకుల నియమాలు మార్చినప్పుడు.. కోహ్లీసేన సైతం చివరికి ఫైనల్స్‌లో చోటుకోసం కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు ఫైనల్‌లో పోటీపడేందుకు ఇరు జట్లూ సిద్ధంగా ఉండటమే కాకుండా ఎంతో ఉత్సాహంగానూ ఉంటాయి"