మరో వారం రోజుల్లో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ.. ట్రెంట్ బౌల్ట్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఉందని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన డాషింగ్ ఓపెనర్.. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. బౌల్ట్, రోహిత్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతుందని, అందుకోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. వీరూ ఇంకా ఏం చెప్పాడో అతడి మాటల్లోనే..
రోహిత్ ఆట కోసం ఎదురుచూస్తున్నా..
"ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ భారత జట్టుకు సవాళ్లు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లిద్దరూ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తారు. దాంతో రోహిత్.. బౌల్ట్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా ఉంటుంది. అందుకోసం నేను ఎదురుచూస్తున్నా. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. 2014లోనూ ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడాడు. దీంతో ఈసారి అక్కడ రాణిస్తాడనే నమ్మకముంది. ఇటీవలి కాలంలో ఓపెనర్‌గానూ అతడు బాగా ఆడుతున్నాడు. కానీ, ఇతర ఓపెనర్ల లాగే తొలి పది ఓవర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. బంతి ఎలా వస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను ముందే గ్రహించాలి. ఇక తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడుతూ పరుగులు చేస్తాడని కచ్చితంగా చెబుతాను"
-వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్.
పంత్.. ఎవరి గురించి పట్టించుకోకు..
"పంత్ బ్యాటింగ్ గురించి అతడికే స్పష్టమైన అవగాహన ఉంది. ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాలను పట్టించుకోకుండా తన ఆట మీదే దృష్టిసారించాలి. బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క బంతి గురించే ఆలోచించాలి. ఒక బంతిని షాట్ ఆడాలనిపిస్తే ధైర్యంగా ఆడాలి. తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. జట్టులో తన స్థానమేంటో అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా మారాడు. ఆరో స్థానంలో బరిలోకి వచ్చి త్వరగా పరుగులు చేస్తుంటే ఒకే సెషన్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు" అని వివరించాడు.