ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ముందు ఎక్కువ అంతరం రావడం ఇబ్బందికరమేనని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనమని తెలిపాడు. వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే కోహ్లీసేనకు అదో పాఠం అవుతుందని పేర్కొన్నాడు. సాధనకు సమయం లేకున్నా ఆస్ట్రేలియాలో మాదిరిగా విజయం సాధిస్తామని వెల్లడించాడు.
‘మా తొలి సాధన శిబిరం ఆరంభమయ్యేందుకు కనీసం మరో వారం పది రోజులు పడుతుంది. ఐపీఎల్ వాయిదా పడ్డప్పటి నుంచి ఆటగాళ్లు క్రికెట్ ఆడలేదు. ఇది మాకు పెద్ద సవాలే. కానీ ఒక్కసారి ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాక టీమ్‌ఇండియా త్వరగా పరిస్థితులకు అలవాటు పడగలదు. ఆస్ట్రేలియాలో మాదిరిగా ప్రదర్శనలు చేయగలదు’ అని అశ్విన్ అన్నాడు.