సుదీర్ఘ ఫార్మాట్లో ప్రపంచకప్‌గా భావిస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్‌ను తర్వాతి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు. ఒక రోజు ఆట పూర్తిగా వృథా కావడం వల్ల ఇప్పుడు అందరి కళ్లు రిజర్వ్ డే మీద పడింది. అయితే ఈ రిజర్వ్ డేను ఎలా వాడుతారు. దీని విషయంలో ఐసీసీ గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనేది ఓ సారి చూద్దాం.
వర్షం వల్ల మొదటి రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు. అయితేనేం రిజర్వ్ డే ఉందిగా అని అభిమానులతో పాటు పలువురు అభిప్రాయపడుతుండొచ్చు. కానీ, వృథా అయిన మొత్తం రోజుకు రిజర్వ్ డేను కేటాయించరు. కేవలం ఫలితం వస్తుందనుకున్న సందర్భంలో లేదా రోజువారీగా ఎన్ని ఓవర్లు తక్కువగా వేశారో అంత మేరకు ఆట సాగడానికి ఈ అదనపు రోజును వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ అదనపు రోజు అనేది పూర్తి ఐదు రోజులకు సంబంధించింది. అది కూడా నిర్వాహకులు అవసరమని భావిస్తేనే అది అమల్లోకి వస్తుంది. లేదంటే మ్యాచ్‌ను డ్రా లేదా టైగా ప్రకటించే అవకాశం ఉంటుంది.