Wtc Final 2023 Winner : టెస్టు క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే WTC Finalలో మరోసారి భారత్ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఈ మహాసమరంలో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచి సత్తా చాటింది. రెండోసారి ఫైనల్‌కు చేరిన భారత్.. ఈ సారైన టైటిల్ గెలిచి ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చుతుందన్న అభిమానుల ఆశలపై రోహిత్ సేన నీళ్లు చల్లింది. అన్ని రంగాల్లో విఫలమై.. కీలకమైన పోరులో మరోసారి తడబాటుకు గురైన 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీ భారత్‌కు కలగానే మిగిలిపోయింది.
444 పరుగుల ఛేదనలో 164/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమ్ ఇండియా.. ఆసీస్ బౌలింగ్ ధాటికి నిలువలేకపోయింది. రికార్డు ఛేజింగ్‌లో ఆశలు రేపిన కోహ్లీ, రహానె వికెట్లు పడిపోవడంతో.. టీమ్‌ఇండియా పతనం ప్రారంభమైంది. అర్ధశతకానికి చేరువలో కోహ్లీ(49) బోలాండ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన జడేజా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. రహానె(46) కూడా ఆ తర్వాత ఎక్కువ సేపు నిలవలేదు. స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ ఎల్బీగా దొరికిపోగా.. చివర్లో కేఎస్ భరత్ (23) కాసేపు క్రీజ్‌లో నిలించేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు.
- భారత్ : తొలి ఇన్నింగ్స్: 296.. రెండో ఇన్నింగ్స్ : 234 ఆలౌట్
- ఆస్ట్రేలియా : తొలి ఇన్నింగ్స్ : 469.. రెండో ఇన్నింగ్స్ : 270-8 (డిక్లేర్డ్)