తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final 2023 : సిరాజ్​@50!.. తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ ఆలౌట్​ - డబ్ల్యూటీసీ ఫైనల్​ 2023 తొలి ఇన్నింగ్స్​

WTC Final 2023 : ఇంగ్లాండ్​ వేదికగా భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ షమి, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో 2 వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్‌ తీశారు.

WTC Final 2023
WTC Final 2023

By

Published : Jun 8, 2023, 6:43 PM IST

Updated : Jun 8, 2023, 7:01 PM IST

WTC Final 2023 : ఇంగ్లాండ్​లోని ఓవల్​ మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 327/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. భారత్ బౌలర్లు పుంజుకోవడంతో మరో 142 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది.

ఆసీస్​ బ్యాటర్​ ట్రావిస్ హెడ్ (163; 174 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు సెంచరీ చేయగా.. స్టీవ్‌ స్మిత్ (121; 268 బంతుల్లో 19 ఫోర్లు) నిలకడగా ఆడి శతకం సాధించాడు. అలెక్స్‌ కేరీ (48; 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్ వార్నర్ (43; 60 బంతుల్లో 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 4, శార్దూల్ ఠాకూర్‌ 2, షమి 2, జడేజా ఒక వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

ట్రావిస్‌ హెడ్‌ (146), స్మిత్‌ (95) స్కోర్లతో రెండో ఆటను కొనసాగించారు. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం షమి బౌలింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌ ఫోర్‌ కొట్టి 150 మార్క్‌ దాటాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న హెడ్‌ను సిరాజ్‌ ఔట్ చేశాడు. హెడ్ వికెట్ కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ (6) షమి బౌలింగ్‌లో స్లిప్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

స్మిత్ శార్దూల్ ఠాకూర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ (5)ను సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ అక్షర్ పటేల్ అద్భుతమై త్రోతో రనౌట్ చేశాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఆసీస్‌ 422/7తో నిలిచింది. లంచ్‌ బ్రేక్ తర్వాత కేరీ దూకుడు పెంచాడు. షమి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. జడేజా వేసిన 115 ఓవర్‌లో మూడో బంతికి సిక్స్ బాదిన కేరీ.. తర్వాతి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్‌ నాటౌట్ ఇవ్వగా.. భారత్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి ఫలితం రాబట్టింది. సిరాజ్‌ బౌలింగ్‌లో నాథన్‌ లైయన్ (9) క్లీన్‌బౌల్డ్ అవ్వగా.. కమిన్స్‌ (9) రహానెకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో ఆసీస్​ ఆలౌటైంది.

సిరాజ్​ అరుదైన ఘనత..
ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా బౌలర్​ మహ్మద్​ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్​ క్రికెట్​లో​ 50 వికెట్ల మైలురాయిని సిరాజ్​ చేరుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్​లో షేర్​ చేసింది.

Last Updated : Jun 8, 2023, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details