WTC Final 2023 Teamindia VS Australia : మరో మూడు రోజుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభంకానుంది. ఈ పోరులో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా తలపడనుంది. అయితే ఈ మెగా ఫైనల్లో భారత బ్యాటర్లకు, ఆసీస్ బౌలర్లకు మధ్య గట్టి పోటీ ఉంటుందనిపిస్తోంది. మన బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే కనిపిస్తుంది.
అయితే 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఇలానే అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయింది. మన బ్యాటర్లు అంచనాలను అందుకోలేక, ఒత్తిడికి తట్టుకోలేక విఫలమయ్యారు. ఇంగ్లిష్ గడ్డపై కివీస్ పేసర్ల దెబ్బకు చేతులెత్తేశారు. అప్పుడు రోహిత్ శర్మ, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, పంత్, అజింక్య రహానె, అశ్విన్, జడేజాతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బరిలో దిగింది. ఈ సారి పంత్ మినహా.. మిగతా ప్లేయర్లంతా జట్టులో ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా మన బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ.. కాస్త ఆలోచించాల్సి వస్తుంది. ఎలాంటి ప్రదర్శన ఇస్తారోనని. అసలే ఇప్పటికే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్ దూరమవ్వడం జట్టుకు దెబ్బ అని చెప్పాలి.
ఇకపోతే అప్పుడు కూడా మన ప్లేయర్స్ అంతా ఐపీఎల్ ఆడి.. ఫైనల్లో ఎంట్రీ వచ్చారు. ఈ లీగ్‌లో ఆట వేరేలా ఉంటుంది. నాన్‌స్టాప్ మ్యాచ్‌లు ఆడుతూ బాగా అలసిపోతారు. ఇప్పుడీ లీగ్ పూర్తై వారం కూడా అవ్వకుండానే తక్కువ సమయంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తగ్గట్లుగా తమను తాము మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటలో మార్పులు చేసుకోవాలి. మరి ఇంగ్లాండ్‌లోని కఠిన పరిస్థితులకు అనుగుణంగా ఆసీస్ బౌలర్లను మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఆ ఇద్దరు నిలబడగలిగితే..
WTC Final 2023 Pujara : కోహ్లీ, పుజారా గట్టిగా నిలబడితే ఈ ఫైనల్లో భారత్‌కు తిరుగుండదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉండటం అంచనాలను పెంచుతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్లో (2021-23) టీమ్‌ఇండియా తరపున ఈ ఇద్దరు పుజారా (887 పరుగులు), కోహ్లీ (869).. బ్యాటింగ్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఇప్పటికే పుజారా.. ఇంగ్లాండ్‌లోని కౌంటీల్లో ఆడుతూ అక్కడి పిచ్ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నాడు. కాబట్టి అతడే జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సీజన్‌లో ససెక్స్ తరపున 68.12 యావరేజ్‌తో 545 పరుగులు చేశాడు.
ఇంకా చెప్పాలంటే పుజారా.. ఆస్ట్రేలియా అంటే దూకుడుగానే ఉంటాడు. ఇప్పటివరకూ కంగారు జట్టుపై 24 టెస్టులు ఆడి 2033 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
WTC Final 2023 Kohli : మరోవైపు కోహ్లీ.. చివరిగా ఆడిన టెస్టు(అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై) ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేశాడు. దీంతో.. సుదీర్ఘ ఫార్మాట్లో తన మూడేళ్ల శతక నిరీక్షణకు తెరదించి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ బోర్డర్- గావస్కర్ సిరీస్‌తో టీమ్‌ఇండియా తరఫున 4 మ్యాచ్‌ల్లో 297.. అత్యధిక పరుగులు చేశాడు. ఇక రీసెంట్గా జరిగిన ఐపీఎల్‌లోనూ దూకుడుగా ఆడి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఇప్పటికే అతడు ఈ జట్టుపై 24 టెస్టుల్లో 1979 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికైన ఓవల్‌లో... టీమ్‌ఇండియా చివరగా ఆడిన (2021లో ఇంగ్లాండ్‌పై) టెస్టులోనూ 50, 44తో మంచిగా రాణించాడు. చూడాలి మరి ఈ ఇద్దరు ఈ సారి ఎలాంటి ప్రదర్శన చేస్తారో. వీరిపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.
వీళ్లపైనా ఆశలు..: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్నాడు శుభ్‌మన్ గిల్. అతడిపై భారీ ఆశలే ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గాను నిలిచి మంచి జోష్‌లో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడు ఆడిన అతడు ఓ శతకంతో పాటు 154 పరుగులు సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు మంచి ఆరంభానిస్తే చాలు.. జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరోవైపు బ్యాటింగ్‌లో రోహిత్‌కు.. ఓవల్‌లో మంచి రికార్డు ఉంది. ఇది కలిసొచ్చే అంశం. అక్కడ ఒకే టెస్టు (2021 ఇంగ్లాండ్‌పై) ఆడిన అతడు.. ఓ సెంచరీ సాధించాడు. విదేశాల్లో హిట్‌మ్యాన్‌కు ఇదే ఫస్ట్ టెస్టు సెంచరీ. ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల్లో 402 పరుగులు సాధించాడు. 16 నెలల తర్వాత మళ్లీ టెస్టు జట్టుకు సెలెక్ట్ అయినా రహానె కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇటీవలే ఐపీఎల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడి.. ఆశలు రేపాడు.
ఆ లోటు తీరుతుందా?.. ఇకపోతే జట్టు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. పంత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆదుకుంటుంటాడు. అయితే అతడు ఈ సారి లేకపోవడం గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే అతడికి విదేశీ గడ్డలపై మంచి రికార్డు ఉంది. ఓవల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు రెండో ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 114, 50 పరుగులు సాధించాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 12 మ్యాచ్‌ల్లో 868 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు.
అయితే ఇప్పుడతడి వికెట్ కీపర్ బ్యాటర్ లోటను ఎవరు తీరుస్తారనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు తీరుస్తారో. ఇకపోతే ఇంగ్లాండ్‌లో.. అందులోనూ ముఖ్యంగా ఓవల్ స్టేడియంలో 2 మ్యాచ్‌ల్లో 249 పరుగులతో మంచి రికార్డు ఉన్న కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో లేకపోవడం కూడా దెబ్బే.
లోయర్ ఆర్డర్ కీలకం.. మరోవైపు కొంతకాలంగా టెస్టుల్లో గమనిస్తే.. భారత బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్ ప్రదర్శన కీలకంగా మారిందనే చెప్పాలి. ఈ డబ్ల్యూటీసీ చక్రంలో లోయర్ ఆర్డర్ 6 నుంచి 9 వరకు స్థానాల్లో వచ్చే బ్యాటర్లు.. 31 ఇన్నింగ్స్‌ల్లో 27.40 సగటుతో 2,935 పరుగులు సాధించారు. మిగతా టీమ్‌లతో పోలిస్తే.. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ యావరేజ్లో ఇదే బెస్ట్. ఆటగాళ్ల పరంగా 45.80 సగటుతో అక్షర్ పటేల్, 43.40 సగటుతో పంత్, 37.39 సగటుతో జడేజా ప్రదర్శన మంచిగా ఉంది.
అదే టాప్-5లో వచ్చే బ్యాటర్ల ప్రదర్శనను చూస్తే 33 ఇన్నింగ్స్‌లో 34.30 యావరేజ్‌తో టీమ్‌ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. కాబట్టి ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్, జడేజా అక్షర్, శార్దూల్.. వీరిలో ఎవరు ఒకరు లోయర్ ఆర్డర్‌లో ఆడినా.. అది కీలకంగా మారుతుంది. ఇంగ్లాండ్‌లో జడేజా.. బ్యాటింగ్‌లో 10 మ్యాచ్‌ల్లో 563 పరుగులు మంచి రికార్డే ఉంది. ఓవల్‌లో రెండు మ్యాచులు ఆడిన అతడు.. 126 పరుగులు చేశాడు.
ఇదీ చూడండి :