WTC Final 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌నైట్ 151/5 స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్ఇండియా మరో 145 పరుగులు జోడించి 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే, ఆసీస్ బౌలర్లు ప్యాట్ కమిన్స్ 3, మిచెల్ స్టార్క్ 2, స్కాట్ బోలాండ్ 2, కామెరూన్ గ్రీన్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ కంటే భారత్ 173 పరుగులు వెనుకబడిపోయింది.
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో అజింక్య రహానె(89), రవీంద్ర జడేజా(48), శార్దూల్ ఠాకూర్(51) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ(15), శుభ్‌మన్ గిల్(13), పుజారా(14), విరాట్ కోహ్లీ(14) ఇలా క్రీజులోకి వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లారు.
రెండో బంతికే శ్రీకర్ ఔట్
మూడో రోజు.. శుక్రవారం 151/5 ఓవర్‌నైట్ స్కోరుతో టీమ్‌ఇండియా ఆట ఆరంభించింది. ఒక పరుగు వచ్చిందో లేదో ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎస్ భరత్ (5) ఔటయ్యాడు. స్కాట్ బొలాండ్ వేసిన 38.2వ బంతికి ఔటయ్యాడు. ఆరో స్టంప్‌లైన్‌లో వచ్చిన బంతి అతడి బ్యాటు లోపలి అంచుకు తగిలి వికెట్లను ఎగరగొట్టింది. ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో క్రీజులో నిలిచిన అజింక్య రహానె (29) అదరగొట్టాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 92 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకొన్నాడు. చివరి డబ్ల్యూటీసీ ఫైనల్లోని తన స్కోరు (49)ని దాటేశాడు.
అజింక్య.. సెంచరీ మిస్!
అజింక్య రహానెకు తోడుగా శార్దూల్ ఠాకూర్ నిలబడ్డాడు. కమిన్స్ బౌలింగ్‌లో అతడి చేతికి వరుసగా రెండుసార్లు బంతి తగిలింది. నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియోల సాయం తీసుకొని మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అప్పట్నుంచి వేగంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరోవైపు రహానె టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దాంతో 60 ఓవర్లకు 260/6తో టీమ్‌ఇండియా లంచ్‌కు వెళ్లింది.
శార్దూల్ హాఫ్ సెంచరీ
భోజన విరామం నుంచి రాగానే టీమ్‌ఇండియాకు వరుస షాకులు తగిలాయి. పరుగులేమీ జత చేయకుండానే అజింక్య రహానె ఔటయ్యాడు. కమిన్స్ వేసిన 61.6వ బంతికి అతడు పెవిలియన్ చేరాడు. అప్పటి వరకు ఈజీ క్యాచులు వదిలేసిన ఆసీస్.. ఈ క్యాచ్‌ను మాత్రం వదల్లేదు. గల్లీలో కామెరాన్ గ్రీన్ అమేజింగ్‌గా అందుకున్నాడు. అప్పటికి స్కోరు 261. దాంతో వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. మరో 10 పరుగులకే ఉమేశ్ యాద్ (5)ను కమిన్సే పెవిలియన్ పంపించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన శార్దూల్ 108 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే జట్టు స్కోరు 294 వద్ద గ్రీన్ బౌలింగ్‌లో కేరీకి క్యాచ్ ఇచ్చాడు. మహ్మద్ షమి (13) ఎక్కువ సేపు నిలవలేదు.