WTC final 2023 shubman gill cameron green catch : సాఫ్ట్ సిగ్నల్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో.. టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ఫస్ట్ వికెట్‌గా శుభమన్ గిల్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బోలాండ్ వేసిన బంతిని గిల్ బాదగా.. దాన్ని గల్లీలో ఉన్న గ్రీన్ నేలకు సమీపంలో క్యాచ్ పట్టాడు. అయితే దీన్ని పట్టిన తీరు వివాదస్పదమైంది. గ్రీన్ పట్టుకున్న క్యాచ్.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. టీవీ రీప్లేలో బంతి నేలను తాకినట్లు కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం గిల్‌ను ఔట్‌గా ప్రకటించారు. దీంతో గిల్ నిరాశగా వెనుదిరగగా.. అభిమానులు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. సాఫ్ట్ సిగ్నల్ నిబంధన అమల్లో ఉంటే గిల్ కచ్చితంగా నాటౌట్ అయ్యేవాడని నెటిజన్లు, ఫ్యాన్స్ అనడం ప్రారంభించారు.
ఈ రూల్ తొలిగింపు.. అయితే ఈ సాఫ్ట్ సిగ్నల్ రూల్‌ను ఈ నెల నుంచే ఐసీసీ తొలగించింది. ఈ మేరకు ఐసీసీ నియమించిన ఓ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో టీమ్ఇండియా మాజీ బ్యాటర్ గంగూలీ కూడా ఓ సభ్యుడు. ఈ రూల్ అనవసరమైన గందరగోళ పరిస్థితులు సృష్టిస్తోందని దాదా అన్నారు.
ఏమిటీ సాఫ్ట్ సిగ్నల్?.. మైదానంలో బాల్‌ను ప్లేయర్స్ సరిగ్గా క్యాచ్ పట్టుకున్నారా? లేదా అది నేలకు తాకిందా? అనే అనుమానం కలిగినప్పుడు.. మైదానంలోని అంపైర్లు ఔట్ లేదా నాటౌట్‌ను 'సాఫ్ట్ సిగ్నల్'గా చూపిస్తారు. టీవీ అంపైర్‌ను తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతారు. రీప్లేలో పరిశీలించిన తర్వాత కూడా క్లారిటీ రాలేదంటే.. మైదానంలోని అంపైర్ తీసుకున్న 'సాఫ్ట్ సిగ్నల్'ను సమర్థిస్తూ టీవీ అంపైర్ నిర్ణయం తీసుకుంటారు. నాటౌట్ అయినప్పటికీ.. స్టేడియంలో అంపైర్ 'సాఫ్ట్ సిగ్నల్' చూపిస్తూ ఔట్ ఇవ్వడం.. దాన్ని టీవీ అంపైర్ సమర్థించడం చాలా సార్లు వివాదంగా మారింది. అందుకే ఈ రూల్‌ను తొలిగించి.. థర్డ్ అంపైర్ నిర్ణయానికి పెద్దపీట వేశారు.
కామెరూన్ గ్రీన్ రియాక్షన్.. కామెరూన్ గ్రీన్ క్యాచ్‌ను ఉద్దేశించి స్టేడియంలోని ప్రేక్షకులు.. 'ఛీటర్, ఛీటర్... మోసం.. మోసం" అంటూ మైదానం దద్దరిల్లేలా అరిచారు. దీనిపై కామెరూన్ స్పందించాడు. "అప్పుడు నేను సరిగ్గానే క్యాచ్ పట్టినట్లు భావించాను. క్లియర్ క్యాచ్‌నే అందుకుని పైకి విసిరా. ఇందులో నాకెలాంటి సందేహనం, అనుమానం అస్సలు కలగలేదు. అయితే.. ఇక్కడ నిర్ణయం థర్డ్ అంపైర్‌కు వెళ్లింది. అతడు ఈ క్యాచ్‌ను సరైనదిగా అంగీకరిస్తూ తన నిర్ణయం ప్రకటించాడు. స్లిప్స్‌లో క్యాచ్‌లను పట్టేందుకు నేను చాలా కష్టపడ్డాను. ఎప్పుటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉన్నాను" అని గ్రీన్ పేర్కొన్నాడు.