WTC Final 2023 Pujara : ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కాగా.. రెండో రోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లీ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా ఔటైన తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శలు గుప్పించాడు.
"పుజారా లాంటి సీనియర్ ఆటగాడు బంతిని తప్పుగా అంచనా వేయడం నిరాశపరిచింది. ఫ్రంట్ ఫుట్ సరిగా వాడకుండా బంతిని వదిలేయడం దారుణం. అతడి ఫ్రంట్ ఫుట్ బంతివైపు వెళ్లాల్సింది. అతడు ఆ బంతిని ముందు ఆడాలని అనుకున్నాడు. కానీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోని బంతిని విడిచిపెట్టాడు. అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాడు. ఆఫ్‌స్టంప్ ఎగిరిపోయింది. ఆ సమయంలో ఆఫ్‌స్టంప్‌కు వెళ్లాల్సిన అతడి ఫ్రంట్ ఫుట్ మిడిల్ స్టంప్‌పైనే ఉండిపోయింది"
-- రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్
"కానీ అతడు మాత్రం తన ఫ్రంట్ ఫుట్ ఆఫ్‌స్టంప్ పైనే ఉందని అనుకున్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ కూడా ఇదే తరహాలో తన వికెట్‌ను కోల్పోయాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై బంతిని ఆడకుండా వదిలేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆఫ్‌స్టంప్ దగ్గరగా ఉన్నప్పుడు అలా చేయాలి. శుభమాన్ గిల్ తన ఫుట్‌వర్క్‌లో విషయంలో కాస్త బద్ధకంగా కనిపించాడు. అయితే గిల్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. కానీ పుజారాకు ఏమైంది?" అని కామెంటరీ సందర్బంగా రవిశాస్త్రి ప్రశ్నించాడు.
పెద్ద మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒత్తిడికి గురవుతోంది: హర్భజన్
WTC Final Harbhajan Singh : టీమ్ఇండియాలో ఐసీసీ టోర్నీలను సాధించడానికి అవసరమైన ధైర్యం లోపించిందని టర్బోనేటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం కొంచెం ఎక్కువ అనిపించిందని పేర్కొన్నాడు. "నైపుణ్యం లేకపోవడం అనే ప్రశ్నే లేదు. మీరు ఎన్ని కీలక మ్యాచ్‌లు ఆడితే.. అంత మెరుగుపడతారు. ఈ పెద్ద మ్యాచ్‌ల్లో మరింత స్వేచ్ఛగా ఆడాలని నేను భావిస్తున్నాను. మన జట్టు ఒకింత ఒత్తిడికి గురైందని నేను అనుకొంటున్నాను. ఫలితం కోసం ఆలోచించకుండా మన ఆటగాళ్లు మరింత స్వేచ్ఛగా ఆడాలి. ఆటగాళ్లను తమదైన శైలిలో ఆడేందుకు వీలైనంత స్వేచ్ఛను ఇస్తే రాణిస్తారు. మీరు వారిపై ఒత్తిడి పెంచితే.. సరిగ్గా ఆడలేరు. రాణించకపోయినా ఫర్వాలేదు.. అత్యుత్తమ ప్రయత్నం చేయాలనే ఆత్మవిశ్వాసాన్ని ఆటగాళ్లలో కల్పిస్తే ఫలితం ఉంటుంది. గతంలో మనం చాలా టోర్నీలను ఈ విధంగానే గెలిచాము" అని భజ్జీ విశ్లేషించాడు. ప్రస్తుతం హర్భజన్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.