WTC Final 2023 Kohli Records : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కోసం టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా కష్టపడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ మరింత మెరుగైన ప్రదర్శనను ఇచ్చి టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు పలు కీలక ఆటగాళ్ల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.
రిచర్డ్స్ రికార్డు బ్రేక్..?
Kohli vs viv Richards : ఇప్పటివరకు 108 టెస్టు మ్యాచుల్లో ఆడిన విరాట్ కోహ్లీ 8,416 పరుగులు చేశాడు. ఆసీస్‌తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతడు మరో 125 పరుగులు చేయగలిగితే టెస్టు కెరీర్‌లో వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ సర్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉన్న 8540 పరుగుల రికార్డును బద్దలు కొడతాడు.
విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ సెహ్వాగ్‌ను దాటి సాధిస్తాడా..?
Kohli vs Shewag : టీమ్‌ఇండియా లెజెండరీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 8,586 పరుగులు చేశాడు. ఆసీస్‌తో జరగబోయే ఈ మ్యాచ్‌లో కోహ్లీ 171 పరుగులు చేస్తే సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డును దాటేస్తాడు. ఈ రికార్డు బద్దలు కొట్టడం కొంచెం కష్టమే అయినా.. కోహ్లీపై ఉన్న నమ్మకంతో అతడి ఫ్యాన్స్ 'విరాట్ భాయ్' కచ్చితంగా ఈ మైలురాయిని ఛేదిస్తాడు అనే ధీమాతో ఉన్నారు.
దూకుడుతో ద్రవిడ్‌ను దాటుతాడా..?
Virat Kohli vs Rahul Dravid : ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కూడా విరాట్ బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. టెస్టుల్లో 60 ఇన్నింగ్స్ ఆడిన ద్రవిడ్ 13 అర్ధశతకాలు, రెండు శతకాల సాయంతో 2143 పరుగులు చేశాడు. కంగారూలపై కోహ్లీ ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్ ఆడి 1979 పరుగులు చేశాడు. ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 164 పరుగులు చేస్తే ద్రవిడ్‌ను రికార్డును బ్రేక్ చేస్తాడు.
పాంటింగ్‌ను దాటేస్తాడా..?
Virat Kohli vs Ricky Pointing : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న 8 సెంచరీల రికార్డును కోహ్లీ ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ మాత్రమే కాదు మరో ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా ఈ ఫీట్‌ను సాధించేందుకు ఛాన్స్ ఉంది. భారత్-ఆస్ట్రేలియా సిరీసుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల జాబితాలో 11 శతకాలతో సచిన్ తెందూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 8 శతకాలతో పాంటింగ్ రెండో స్థానంలో ఉండగా.. కోహ్లీ, స్మిత్ ఎనిమిదేసి శతకాలతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వీళ్లిద్దరిలో ఎవరు సెంచరీ చేసినా వాళ్లు పాంటింగ్‌ను దాటేసే అవకాశం ఉంది. కానీ, సచిన్ రికార్డును బ్రేక్ చేయడం మాత్రం వీళ్లకంత సులువు కాకపోవచ్చు.