WTC Final 2023 Rahane : ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ విఫలమైనా.. స్టార్ బ్యాటర్ అజింక్య రహానె అద్భుతంగా పోరాడాడు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును రహానే అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ముందుగా రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రహానె.. రెండో రోజు శ్రీకర్ భరత్ ఔటైనా తన వంతు కృషి చేశాడు.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో రెండో రోజు బ్యాటింగ్ చేస్తుండగా రహానె చేతి వేలికి గాయమైంది. ఆ వేలికి బ్యాండేజ్ వేసుకొని బ్యాటింగ్ చేసిన రహానె.. మూడో రోజు కూడా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు. మరోసారి బంతి గాయంపైనే తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేయగా.. రహానె మొండిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో టెస్ట్ ఫార్మాట్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 13వ భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 141 ఇన్నింగ్స్‌ల్లో రహానే.. 26 హాఫ్ సెంచరీలు, 12 శతకాలు నమోదు చేశాడు.