WTC Final 2023 Ashwin: ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసిన అభిమానుల కోసం మరో టోర్నమెంట్ సిద్ధమైంది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరిగే ఈ టెస్ట్ సమరానికి ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ జట్టు ఖరారైంది. అయితే ప్రపంచ టెస్టు రారాజుగా తేల్చే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే టీమ్‌ఇండియా తుది జట్టులోకి ఎవర్ని సెలెక్ట్ చేస్తారనే చర్చ ఆసీస్ శిబిరంలో జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం రాకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా సహాయక కోచ్ డానియల్ వెటోరి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ తరఫున బహుశా అశ్విన్ ఆడకపోవచ్చని ఆయన చెప్పాడు. ఆటగాళ్ల ఎంపికతో సంబంధం లేకుండా ఇప్పటికే ఇరు జట్ల ప్లేయర్స్ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశారు. అయితే మ్యాచ్ జరిగే ఓవల్ మైదానం పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. అందుకే టీమ్‌ఇండియా తుది జట్టులో ఒక స్పిన్నర్‌కు మాత్రమే అవకాశం కల్పిస్తారని ఆసీస్ భావిస్తోంది.
ఆస్ట్రేలియా సహాయక కోచ్ డానియల్ వెటోరి
"టీమ్‌ఇండియా ఎలాంటి బౌలింగ్ వ్యూహాలతో బరిలోకి రానుందనే దానిపై మేం చర్చించాం. తుది జట్టులో జడేజా తప్పకుండా ఉంటాడని భావిస్తున్నా. ఇతడు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ జట్టుకు అదనపు బలంగా మారతాడు. ఆరో స్థానంలో కీలకమవుతాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ కూడా అద్భుతమైన బౌలర్. ఇలాంటి ఆటగాడిని సెలక్ట్ చేసేందుకు ఏ జట్టైనా ప్రాధాన్యత ఇస్తాయి.అయితే ఈసారి మాత్రం టీమ్ కాంబినేషన్ అంచనా ప్రకారం తుది జట్టులో అశ్విన్‌కు అవకాశం రావడు కష్టంగా కనిపిస్తోంది. మ్యాచ్ జరిగే ఓవల్ పిచ్ మొదట పేస్‌కు సహకరిస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారొచ్చు. కానీ, ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ముగ్గరు పేసర్లు కాకుండా భారత్ నాలుగో ఫాస్ట్ బౌలర్‌తో బరిలోకి దిగుతుందో లేదో వేచి చూడాలి. ఆ జట్టులో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నాడు. దీంతో జడేజాతోపాటు శార్దూల్‌కు తుది జట్టులో అవకాశం రావొచ్చని అనుకుంటున్నాను."
- డానియల్ వెటోరి, ఆస్ట్రేలియా సహాయక కోచ్
నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసేవాడ్ని!
"గతంలో ఫైనల్స్‌కు చేరినప్పుడు మ్యాచ్ నుంచి మీరు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకొన్నారనేది చాలా ముఖ్యం. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జరగాలి. గతంలో సౌథాంప్టన్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. అందుకే.. నా 12 మంది ఎంపిక చాలా స్పష్టంగా ఉంటుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, 3వ ఆటగాడిగా ఛతేశ్వర్ పుజారా, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ ఆటగాడిగా రహానే ఉంటారు. ఇక కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య ఎంపిక కీలకం. ఎవరు ఆడుతున్నారనే దాని ఆధారంగా ఎంపిక ఉండాలి. ఇద్దరు స్పిన్నర్లుంటే భరత్‌ను ఎంపిక చేస్తాను. అదే నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ ఉంటే ఇషన్ కిషన్ వైపు మొగ్గు చూపిస్తాను. ఇక 6లో జడేజా, 7లో షమీ, 8లో సిరాజ్, 9లో శార్దూల్, 11లో అశ్విన్, 12వ ప్లేయర్‌గా ఉమేష్ యాదవ్‌ను ఎంపిక చేస్తాను. ఒకవేళ నేనే సెలక్టర్ హోదాలో ఉంటే ఈ విధంగా ఆటగాళ్ల ఎంపిక జరిగేది" అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి జట్టు ఎంపికపై తనకున్న స్పష్టతను వివరించాడు.