WTC Final 2023 Teamindia VS Australia : ఇంకో రెండు రోజుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ తుది పోరులో పోటీపడబోయే టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా జట్లు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి? అందులో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా.. ఎన్ని ఫైనల్స్ ఆడాయి (వేర్వేరుగా, కలిసి).. వాటిలో భారత్ ఎన్ని సార్లు విజయం సాధించింది, ఆస్ట్రేలియా ఎన్ని సార్లు గెలిచింది? వంటి విషయాలను తెలుసుకుందాం..
ICC Finals : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వన్డే వరల్డ్‌కప్ (12), టీ20 వరల్డ్‌కప్ (8), డబ్ల్యూటీసీ (1), ఛాంపియన్స్ ట్రోఫీ (8) జరిగాయి. అందులో టీమ్‌ఇండియా 10 ఫైనల్ మ్యాచులు ఆడి.. ఐదింటిలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 11 ఫైనల్స్‌లో బరిలోకి దిగి .. ఎనిమిది విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
టీమ్‌ఇండియా ఆడిన ఐసీసీ ఫైనల్స్(ICC Finals Teamindia)
- 1983 వన్డే వరల్డ్‌కప్‌లో విండీస్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది.
- 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై భారత్ ఓటమిని అందుకుంది.
- 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో పాటు సంయుక్తంగా విజేతగా నిలిచింది భారత్.
- 2003 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోయింది.
- 2007 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై గెలిచింది.
- 2011 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై గెలిచింది.
- 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
- 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ఓటమిని అందుకుంది.
- 2021 డబ్ల్యూటీసీలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.