తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Finalలో టీమ్​ఇండియాకు బలం వీరే.. తుది జట్టు సంగతేంటి? - డబ్ల్యూటీసీ ఫైనల్​ 2023 టీమ్స్​

WTC Final 2023 : జూన్ 7వ తేదీ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా బలబలాలు తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 2, 2023, 6:43 AM IST

WTC Final 2023 Teamindia Squad : ఐపీఎల్ మజా ముగిసింది. వచ్చే వారం మరో పసందైన మ్యాచ్ కనువిందు చేయనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌.. టెస్టు అభిమానులకు అసలైన కిక్ ఇవ్వనుంది. ఇంగ్లాండ్​లోని ఓవల్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 12వ తేదీ వరకు ఫైనల్ జరగనుంది. ఈ పోరులో ఆస్ట్రేలియా-టీమ్​ఇండియా (AUS vs IND) తలపడనున్నాయి. ఇందులో గెలిచిన టీమ్​కు ఛాంపియన్‌షిప్‌ గదతో పాటు ప్రైజ్‌మనీ ఇస్తారు. అంతకుముందు ఆస్ట్రేలియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో ముద్దాడిన టీమ్‌ఇండియా.. మరోసారి అదే ఆధిపత్యం ప్రదర్శించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా బలబలాలు తెలుసుకుందాం..

పుజారా తర్ఫీదు..
WTC Final 2023 Pujara : టీమ్‌ఇండియాలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో దాదాపు రెండు నెలలపాటు ఆడారు. టీ20 క్రికెట్‌ ఆడిన వారికి.. మళ్లీ టెస్టుఫార్మాట్​కు అలవాటు పడటానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. అయితే వీరందరికీ సీనియర్‌ ప్లేయర్​ ఛెతేశ్వర్‌ పుజారా గురువు అవతారం ఎత్తాల్సి ఉంటుంది. కౌంటీ క్రికెట్‌ ఆడిన పుజారా.. ఇంగ్లాండ్‌లోని పరిస్థితులకు భారత ఆటగాళ్లను త్వరగా అలవాటు పడేలా శిక్షణ ఇవ్వాలి. అతడు ఇప్పటికే ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవల్ పిచ్‌ కూడా ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి.. ఆసీస్ పేస్‌దళం ముందు.. టీమ్​ఇండియా బ్యాటింగ్ విభాగం ఏమాత్రం నిలవగలదో చూడాల్సిందే.

కోహ్లీనే కీలకం..
WTC Final 2023 Kohli : ఇకపోతే స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారాకు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. పుజారా కౌంటీ క్రికెట్ ఆడి వచ్చాడు. కానీ విరాట్ మాత్రం ఐపీఎల్‌ నుంచి ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్​లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే బోర్డర్ - గావస్కర్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లోనూ భారీ సెంచరీ సాధించాడు. కాబట్టి అతడిపై భారీ ఆశలు ఉన్నాయి. ఆసీస్‌పై 24 టెస్టులు ఆడిన అతడు 1,979 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి. ఇక పుజారా కూడా 24 టెస్టుల్లో 2,033 పరుగులు చేశాడు. టాప్‌ ఆర్డర్‌లో వీరిద్దరూ రాణిస్తే భారత్‌కు తిరుగుండదనే చెప్పాలి. ఇంకా ఐపీఎల్​లో సూపర్ ఫామ్‌తో అదరగొట్టిన శుభమన్​ గిల్.. సుదీర్ఘఫార్మాట్‌లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అతడు కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి శుభారంభం అందిస్తే మంచిది.

ఆ లోటును అతడే తీర్చాలి..
ఐపీఎల్‌లో అజింక్య రహానె బాగా రాణించాడు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత భారత టెస్టు జట్టులోకి అడుగు పెట్టాడు. రిషభ్‌ పంత్, కేఎల్ రాహుల్‌ జట్టుకు దూరమవ్వడంతో.. మిడిలార్డర్‌ బ్యాటర్లు లేని లోటును అతడే తీర్చాలి. ఒకవేళ అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా.. టాప్‌ ఆర్డర్‌ను సమన్వయం చేసుకుంటూ లోయర్‌ ఆర్డర్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కన్నా భరత్‌కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాహుల్​ గాయపడటం కూడా అతడికి కలిసొస్తుంది. ఇక లెఫ్ట్‌ఆర్మ్‌ బ్యాటరే కావాలంటే మాత్రం ఇషాన్‌ను తీసుకోవచ్చు.

ఆల్‌రౌండర్లు ఎవరో..
టీమ్‌ఇండియాలో ఆల్‌రౌండర్లకు కొదవే లేదు. కానీ, ఇంగ్లాండ్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి, పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌ అయితే కరెక్ట్​. మిగతా వారిలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్ స్పిన్‌ కమ్‌ బ్యాటర్లు. కాబట్టి తుది జట్టులో వీరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉండొచ్చు. లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ కావాలంటే మాత్రం జడ్డూకే ఛాన్స్ ఉంటుంది. ఆస్ట్రేలియాపై మరీ ముఖ్యంగా డబ్ల్యూటీసీ మ్యాచ్​ల్లో మంచి రికార్డు ఉన్న అశ్విన్‌కైనా ఛాన్స్‌ దకొచ్చు. చెప్పలేం. కానీ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం కుదరకపోవచ్చు.

వాళ్లపైనే ఆధారం..
టీమ్‌ఇండియా పేసర్ అనగానే గుర్తురొత్తే పేరు బుమ్రా. కానీ సర్జరీ కారణంగా అతడు దూరమయ్యాడు. కాబట్టి షమీ, సిరాజ్‌పైనే ఆధరపడి ఉంది. ఓవల్ పిచ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో వారిద్దరితో పాటు మూడో పేసర్‌ను తీసుకోవాలనుకుంటే.. మరో ముగ్గురు రేసులో ఉన్నారు. జయ్‌దేవ్ ఉనద్కత్, ఉమేశ్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌. వీరిలో శార్దూల్‌ మినహా ఇద్దరూ కేవలం పేసర్లు. శార్దూల్ ఆల్‌రౌండర్‌. కాబట్టి అదనంగా బ్యాటర్‌గా ఉపయోగపడతాడని అనుకుంటే మాత్రం శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. లేదంటే వైవిధ్యం కోసం లెప్ట్‌ఆర్మ్‌ పేసర్ జయ్‌దేవ్‌ వైపు చూపొచ్చు.

అన్నింటిలో రాణించాలి..
మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ చివరి వరకు పోరాడినా.. కీలక సమయంలో డీలా పడటంతో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. కాబట్టి ఈ రెండోసారి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో (2021-2023) గెలవాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాలి. అయితే ఇప్పుడు ఆసీస్‌ను ఏమాత్రం అస్సలు తక్కువగా అంచనా వేయకూడదు. లబుషేన్, ఖవాజా, స్టీవ్‌స్మిత్, రెన్‌షా, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, వార్నర్‌ వంటి ఆటగాళ్లతో భారీ బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details