తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final 2023 : 'మ్యాచ్​ విన్నర్​ను ఎలా పక్కన పెడతారు?'.. రోహిత్​పై నెటిజన్లు ఫుల్​ ఫైర్​!

WTC Final 2023 Ashwin : వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు తుది జట్టులో స్థానం లభించకపోవడంపై టీమ్ఇండియా కెప్టెన్‌, కోచ్‌లను సోషల్​మీడియా వేదికగా నెటిజన్లు నిలదీస్తున్నారు. మ్యాచ్‌ విన్నర్‌ను ఎలా పక్కన పెడతారని ప్రశ్నిస్తున్నారు.

WTC Final 2023 Ashwin
WTC Final 2023 Ashwin

By

Published : Jun 7, 2023, 9:38 PM IST

WTC Final 2023 Ashwin : వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్​లో భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు తుది జట్టులో స్థానం లభించకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌ అశ్విన్‌ను పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా తుది జట్టులోకి తీసుకోలేకపోయామని మేనేజ్‌మెంట్‌ వివరణ ఇస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు. కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ అయిన అశ్విన్‌ను విస్మరించడంపై వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మ్యాచ్‌ విన్నర్‌ను ఎలా పక్కన పెడతారని టీమ్ఇండియా కెప్టెన్‌, కోచ్‌లను సోషల్​మీడియా వేదికగా నెటిజన్లు నిలదీస్తున్నారు. మ్యాచ్‌ స్టార్ట్‌ అయ్యాక పిచ్‌ పేసర్లకు సహకరించడం చూశాక కూడా అభిమానులు ఈ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. సోషల్‌మీడియా వేదికగా మేనేజ్‌మెంట్‌పై విమర్శినాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అశ్విన్‌ విషయంలో అభిమానుల హడావుడి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.

ఇంగ్లాండ్‌లో అశ్విన్‌ ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్‌లో టీమ్​ఇండియా ఓడిపోవడం! ఇక్కడ అశ్విన్‌ ఆడిన 7 మ్యాచ్‌ల్లో టీమ్​ఇండియా ఏకంగా ఆరింటిలో ఓటమిపాలైంది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. అయితే ఈ విషయాన్ని ఉదాహరిస్తూ.. కొందరు చెడు ప్రచారం చేస్తున్నారు. అశ్విన్‌ను ఆడించకపోవడమే మంచిదైందంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో అశ్విన్‌ కంటే శార్దూల్‌ ఠాకూరే బెటర్‌ ఛాయిస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

అందుకే అశ్విన్​ను పక్కన పెట్టాం: రోహిత్​
అయితే వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​ టాస్​ సమయంలో అశ్విన్​ను పక్కన పెట్టడాన్ని నాసిర్ హుస్సేన్ ప్రస్తావించాడు. దీనికి రోహిత్ సమాధానమిచ్చాడు. "ఇది ఎప్పుడైనా కఠిన నిర్ణయమే. అతడు చాలా ఏళ్లుగా మా మ్యాచ్ విన్నర్​గా ఉన్నాడు. అందుకే అతన్ని పక్కన పెట్టడం అన్నది కఠినమైన నిర్ణయమే. కానీ జట్టు అవసరాలకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అందుకే చివరికి ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాం. నిజానికి టెస్టుల్లో ప్రస్తుతం అశ్విన్ 869 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఇక ఓవల్లో ఉన్న కండిషన్స్ మేఘావృతమై ఉంది. పిచ్ పెద్దగా మారేలా కనిపించడం లేదు. నలుగురు పేసర్ల, ఒక స్పిన్నర్​ను తీసుకున్నాం. జడేజా స్పిన్నర్​గా ఉంటాడు" అని రోహిత్ చెప్పాడు.

అందుకే తెలుగుబిడ్డకు ఛాన్స్​
ఈ మ్యాచ్​లోవికెట్ కీపింగ్ విషయంలోనూ టీమ్​ఇండియా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్‌కు బదులు తెలుగు తేజం కేఎస్ భరత్‌కు అవకాశం కల్పించింది. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమవ్వగా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ కీపర్‌గా ఆడించాలనుకున్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొడకండరాల గాయంతో చివరి నిమిషంలో జట్టుకు దూరమయ్యాడు. దాంతో కేఎస్ భరత్‌కు బ్యాకప్‌గా సెలెక్టర్లు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. దాంతో తుది జట్టులోకి ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారని అంతా భావించారు. దూకుడుగా ఆడే స్వభావం కలిగి ఉండటం, లెఫ్టాండర్ కావడంతో అతడికే అవకాశం దక్కుతుందనకున్నారు. కానీ టీమ్‌ మేనేజ్‌మెంట్ మాత్రం కేఎస్ భరత్‌కు చోటిచ్చింది. అతడి అనుభవానికి టీమ్‌ మేనేజ్‌మెంట్ ఓటేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన కేఎస్ భరత్.. ఇప్పటి వరకు 4 టెస్ట్‌లు ఆడాడు.

ABOUT THE AUTHOR

...view details