WTC Final 2023 Ajinkya Rahane test captain : టీమ్ఇండియా మళ్లీ అదే ధోరణిని కనబరిచింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్నప్పటికీ.. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీలలో చేతులెత్తేస్తోంది. రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 WTC Final చేరినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమిని అందుకుంది. కీలక తుది పోరులో అన్ని విభాగాల్లో విఫలమైంది రోహిత్ సేన. దీంతో భారత్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. టెస్టుల్లో సారథిగా రోహిత్ సరైన వాడు కాదని.. అతడిని నుంచి సారథ్య బాధ్యతలు తొలగించాలని అభిప్రాయపడుతున్నారు. వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అజింక్యా రహానే పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
Ajinkya rahane test captaincy record : ఒకవేళ రోహిత్ శర్మను ఈ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తే.. ప్రత్యామ్నయంగా అజింక్యా రహానేను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే.. దాదాపు 500 రోజుల విరామం తర్వాత మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడిన రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మంచి ప్రదర్శన చేశాడు. అసలు అతడు తుది జట్టులో లేకపోయి ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ మూడు రోజుల్లోనే ముగిసిపోయేదేమో. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతడు 89 పరుగులు చేశాడు. ఇదే హైయెస్ట్ స్కోర్. ఈ ఇన్నింగ్స్ టీమ్ ఇండియా పరువు కాపాడిందనే చెప్పాలి. అందుకే అతడు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగడానికి కారణమయ్యాడు.
అందుకే రోహిత్ శర్మ స్థానంలో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా రహానే సరైనోడని కొంతమంది క్రికెట్ ప్రియులు అంటున్నారు. ఇంకా 2020-21లోనూ టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పుడు మొదటి టెస్టు ఓటమి తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీదు స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే.. తాత్కాలిక సారథిగా జట్టును నడిపించాడు. అలా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
rahane captain australia : మెల్‌బోర్న్ టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌గా అతడు తీసుకున్న నిర్ణయాలు, అలానే బ్యాటింగ్‌లో సెంచరీ బాదడంతో టీమ్ఇండియా రెండో టెస్టు గెలిచింది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో డ్రా.. గబ్బా వేదికగా జరిగిన చివరి నాలుగో టెస్టులో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది టీమ్ఇండియా. ఫలితంగా 2-1తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో భవిష్యత్త్ కెప్టెన్‌గా రహానే పేరు అంతటా మార్మోగిపోయింది.