Warner Ball tampering : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు(డబ్ల్యూటీసీ) ముందు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకుపడ్డాడు. తన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని అన్నాడు. అలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
David Warner Cricket Australia :ఏం జరిగిందంటే.. 2018లో బాల్ టాంపరింగ్ విషయంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటే అతడి కెప్టెన్సీపై జీవితకాలం బ్యాన్ విధించింది. అయితే ఈ టాంపరింగ్లో వార్నర్‌తో పాటు ఉన్న స్టీవ్ స్మిత్‌పై అంతగా కఠిన చర్యలేమీ తీసుకోలేదు క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో స్మిత్.. మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యాడు. అలాగే ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో టీమ్‌ను కూడా ముందుండి నడిపిస్తున్నాడు.
అయితే ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన వార్నర్.. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన కెప్టెన్సీ బ్యాన్‌పై గతేడాది రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీ పానెల్‌ను నియమించింది ఆ దేశ బోర్డు. అయితే ప్యానెల్.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తన రివ్యూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు.
ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఈ విషయాలన్ని గుర్తుచేసుకుంటూ.. క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి అసహనం వ్యక్తం చేశాడు. "క్రికెట్ ఆస్ట్రేలియా నా పట్ల చూపిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. నేను గతాన్ని మార్చిపోవాలని అనుకుంటుంటే.. బోర్డు మాత్రం ఇంకా కొనసాగించాలనే ధోరణితో ఉంది. బోర్డులో ఒక్కరు కూడా పారదర్శకంగా లేరు. బోర్డులో నాయకత్వ లోపం సృష్టంగా కనిపిస్తోంది. నేను మర్చిపోదామని అనుకున్న ప్రతీసారి సీఏ దానిని బయటకు తీస్తూనే ఉంది. టెస్టు మ్యాచులు ఆడేటప్పుడు ప్రతిరోజు లాయర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. ఇదంతా నా వ్యక్తిగత ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. నా ఏకాగ్రతను దెబ్బతీసింది. అగౌరవంగా అనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో ఇదంతా ప్రారంభమైంది. దీనిపై నేను తీవ్ర అసహనానికి గురయ్యాను." అని వార్నర్ పేర్కొన్నాడు.