తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2023: దంచికొట్టిన హీలీ.. యూపీ ఘన విజయం.. ఆర్సీబీకి మళ్లీ నిరాశే - మహిళల ప్రీమియర్​ లీగ్​ ఆర్సీబీ

మహిళల ప్రీమియర్​ లీగ్​లో ఆర్సీబీకి మళ్లీ నిరాశే ఎదురైంది. యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. యూపీ ఓపెనర్ అలీసా​ హీలీ అదరగొట్టింది.

wpl 2023 royal challengers bangalore vs up warriors won the match
wpl 2023 royal challengers bangalore vs up warriors won the match

By

Published : Mar 10, 2023, 10:17 PM IST

Updated : Mar 10, 2023, 10:41 PM IST

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా 13 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు అలీసా హీలీ (96 నాటౌట్; 47 బంతుల్లో 18×4,1×6), దేవికా వైద్య (36, 31 బంతుల్లో 5×4) పరుగుల వరద సృష్టించారు. వీరిద్దరి ధాటికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బౌలర్లు చేతులెత్తేశారు.

139 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన యూపీ.. ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రారంభం నుంచే అలీసా హేలీ విజృంభించింది. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీకి పంపించింది. బౌలింగ్‌ ఎవరిదైనా.. వరుస షాట్లు ఆడింది. ఆమెకు మరో ఓపెనర్‌ దేవికా వైద్య చక్కని సహకారం అందించింది. దీనికి తోడు టార్గెట్‌ కూడా చిన్నదే కావడంతో బెంగళూరు జట్టుకు ఓటమి తప్పలేదు.

అంతకు ముందు, తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (4) తక్కువ స్కోరుకే ఔటయ్యింది. రాజేశ్వరి గైక్వాడ్‌ వేసిన 3.1వ బంతికి షాట్‌ ఆడబోయి అంజలి శ్రావణికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సోఫీ డివైన్‌తో కలిసి మరో ఓపెనర్‌ పెర్రీ ఇన్నింగ్స్‌ నిర్మించింది. వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే, ఈ జోడీని ఎక్లెస్టోన్‌ విడగొట్టింది. జట్టు స్కోరు 73 పరుగుల వద్ద డివైన్‌ బౌల్డయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కనిక ఆహుజ (8), హీదర్‌ నైట్‌ (2) శ్రేయంక పాటిల్‌ (15) తక్కువ స్కోరుకే వరుసగా వెనుదిరుగుతున్నా పెర్రీ మాత్రం పట్టు విడవలేదు. పరుగు పరుగు జోడిస్తూ అర్ధశతకం పూర్తి చేసింది. అయితే, జట్టు స్కోరు 125 వద్ద దీప్తి శర్మ బౌలింగ్‌లో మెక్‌గ్రాత్‌కు క్యాచ్‌ ఇచ్చి.. పెర్రీ వెనుదిరిగింది. దీంతో ఒక్కసారిగా జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ పెద్దగా రాణించకపోవడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ 138 పరుగుల తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్​లో విజయంతో టోర్నీలో 2 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో యూపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ఒక్క విజయాన్ని అందుకోలేక అట్టడుగు స్థానంలో ఉంది.

Last Updated : Mar 10, 2023, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details