మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబయి-గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో నాలుగు విజయాలను దక్కించుకున్న ఆ టీమ్.. ఇప్పుడు తన ఐదో మ్యాచ్‌లోనూ గెలిచింది. ఈ విజయంతో డబ్ల్యూపీఎల్‌లో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 107 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో హర్నిల్(22) టాప్ స్కోరర్. నాట్ సీవర్ (3/21), హేలీ మాథ్యూస్ (3/23), అమేలియా కెర్ (2/18)ల దెబ్బకు గుజరాత్ అస్సలు కోలుకోలేకపోయింది. తొలి ఓవర్లోనే సోఫియా డంక్లీ (0)ను పేసర్ నాట్ సీవర్ ఔట్ చేసింది. అలా గుజరాత్ పతనం మొదలైంది. స్పిన్నర్లు హేలీ, అమేలియాలు కూడా రెచ్చిపోయారు. వికెట్లు పడగొడుతూ గుజరాత్‌ను బెంబేలెత్తించారు. దీంతో సబ్బినేని మేఘన (16), హర్లీన్ డియోల్ (22), స్నేహ్ రాణా (20) కాసేపే రాణించారు. అలా మొత్తంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులే చేసింది.
మెరిసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్.. ప్లేఆఫ్స్‌లో ముంబయి - గుజరాత్‌పై ముంబయి గెలుపు
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో డబ్ల్యూపీఎల్‌లో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టులో హర్మన్‌ప్రీత్ (51; 30 బంతుల్లో 7×4, 2×6), యాస్తిక భాటియా(44; 37 బంతుల్లో 5×4, 1×6), నాట్ సీవర్(36; 31 బంతుల్లో 5×4, 1×6) అదరగొట్టారు. తొలి ఓవర్లోనే హేలీ మాథ్యూస్ (0) వికెట్ కోల్పోయినా.. అనంతరం ఇన్నింగ్స్ సాఫీగానే ముందుకు సాగింది. ఓపెనర్ యాస్తికతో కలిసి నాట్ సీవర్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. యాస్తిక కూడా బౌండరీలు బాదుతూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 11వ ఓవర్లో సీవర్ ఔటైంది. ఆ సమయానికి ఆ జట్టు స్కోరు 75. అనంతరం కాసేపటికే హర్మన్‌ప్రీత్‌తో సమన్వయ లోపంతో యాస్తిక రనౌట్‌గా వెనుదిరిగింది. అలా 84/3తో ముంబయి కాస్త ఇబ్బందుల్లో పడినట్లు కనిపించినా.. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ రెచ్చిపోయి ఆడడంతో ఆ జట్టు వేగం పుంజుకుంది. ఆష్లీ గార్డ్‌నర్ ధాటికి ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ.. హర్మన్ అదిరిపోయే భారీ షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు పరుగెత్తించింది. ఆమె 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదడంతో ముంబయి స్కోరు 150 దాటేసింది. అలా మొత్తంగా ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డ్‌నర్ (3/34) బాగా ఆకట్టుకుంది. కిమ్ గార్త్, స్నేహ్ రాణా, తనుజ కన్వర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి:నా తప్పులే నన్ను సెంచరీకి దూరం చేశాయి.. నేను రికార్డుల కోసం ఆడను : కోహ్లీ