తొలి మహిళల ప్రీమియర్ లీగ్ విజయవంతంగా దూసుకుపోతోంది. మహిళలు.. అందిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మైదానంలో మెరుపులు మెరిపిస్తున్నారు. మరపురాని ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అయితే తొలి లీగ్‌లో ముంబయి ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం యూపీతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. యూపీ నిర్దేశించిన లక్ష్యాన్ని 17.3 ఓవరల్లోనే ఛేదించేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. మథ్యూస్, బ్రంట్ కూడా మెరిశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గౌక్వాడ్, సోఫియ్ తలో ఒక వికెట్ పడగొట్టారు.
WPL 2023: హర్మన్‌ప్రీత్ ధనాధన్ ఇన్నింగ్స్.. యూపీపై ముంబయి ఘన విజయం - మహిళల ప్రీమియర్ లీగ్ అప్డేట్లు
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ అలీసా హీలే (58; 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), తాహిలా మెక్‌గ్రాత్ (50; 37 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. దేవికా వైద్య (6), ఎకిల్ స్టోన్ (1), దీప్తి శర్మ (7) విఫలమవ్వగా.. కిరణ్ నవ్‌గిరె (17; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. శ్వేత (2), సిమ్రాన్ (9) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమేలియా కెర్ రెండు, హేలీ మాథ్యూస్ ఒక వికెట్ చొప్పున తీశారు.
సైకా ఇషాక్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ దేవికా వైద్య ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. మరో ఓపెనర్ హీలే మాత్రం దూకుడుగా ఆడింది. సైకా వేసిన నాలుగో ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాదింది. నాట్ సీవర్ వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టింది. నిలకడగా ఆడుతున్న కిరణ్ నవ్‌గిరెను అమేలియా పెవిలియన్‌కు పంపింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్ దూకుడుగా ఆడింది. అమేలియా వేసిన 9 ఓవర్‌లో మెక్‌గ్రాత్ మూడు ఫోర్లు బాదింది. హీలే, మెక్‌గ్రాత్ వరుస ఓవర్లలో నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న వీరిద్దరిని 17 ఓవర్‌లో సైకా ఔట్ చేసింది. హేలీ మాథ్యూస్ వేసిన తర్వాతి ఓవర్‌లోనే ఎకిల్ స్టోన్ (1) కూడా పెవిలియన్ చేరింది. అమేలియా వేసిన చివరి ఓవర్లో మూడో బంతికి దీప్తి శర్మ స్టంపౌట్ అయింది.