మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో పురుషుల ఐపీఎల్ మాదిరిగానే పరుగుల వరద పారుతోంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 207 పరుగుల స్కోరు నమోదు చేయగా.. రెండో మ్యాచ్‌లోనే ఆ రికార్డును దిల్లీ బద్దలుకొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.
WPL 2023: అదరగొట్టిన దిల్లీ ఓపెనర్లు.. ముంబయి రికార్డ్ బ్రేక్ - మహిళల ప్రీమియర్ లీగ్ దిల్లీ
డబ్ల్యూపీఎల్‌లో బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో దిల్లీ ఇన్సింగ్స్ పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ఓపెనర్లు చెలరేగిపోయి ఆడారు. షెఫాలీ వర్మ (84), మెగ్ లానింగ్ (72) అర్ధ శతకాలతో అదరగొట్టారు.
కెప్టెన్ మెగ్ లానింగ్ (72; 43 బంతుల్లో 14 ఫోర్లు), షఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో దంచి కొట్టారు. షఫాలీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. లానింగ్ 30 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకుంది. బెంగళూరు బౌలర్లలో హీథర్ నైట్ రెండు వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లకు వికెట్లు దక్కలేదు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి షఫాలీ, మెగ్ లానింగ్ పోటాపోటీగా బౌండరీలు బాదారు. మెగన్ స్కట్ వేసిన రెండో ఓవర్‌లో లానింగ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. ప్రీతి బోస్ వేసిన నాలుగో ఓవర్‌లో షఫాలీ ఓ సిక్సర్ బాదింది. సోఫీ డివైన్ వేసిన ఆరో ఓవర్‌లో చెరో రెండు బౌండరీలు బాదారు. ఆషా శోభన వేసిన తొమ్మిదో ఓవర్‌లో షఫాలీ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్.. లానింగ్ ఓ ఫోర్ రాబట్టడంతో ఈ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులొచ్చాయి. హీథర్ నైట్ వేసిన 11 ఓవర్‌లో మరో సిక్సర్ బాదిన షఫాలీ.. రేణుకా సింగ్ వేసిన తర్వాతి ఓవర్‌లో బంతిని మూడు సార్లు బౌండరీకి పంపింది. వరుస బౌండరీలతో విరుచుకుపడుతూ శతకాల దిశగా సాగుతున్న ఈ ఇద్దరూ బ్యాటర్లను హీథర్ ఒకే ఓవర్‌లో ఔట్ చేసి దిల్లీకి ఉపమశమనం అందించింది. ఆ తర్వాత మెరిజన్నే (39*), జెమీమా రోడ్రిగ్స్ (22*) కూడా రాణించడంతో దిల్లీ రికార్డు స్కోరు సాధించింది.