భారత్ దేశంలో ప్రజలకు, క్రికెట్‌కు విడదీయలేని బంధం ఉంది. క్రికెట్ బాగా ఆడితే స్వదేశానికి చెందిన ప్లేయర్లనే కాదు విదేశీ క్రికెటర్లను మనవాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వారిలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒకడు.
డివిలియర్స్‌కు మన దేశంతో చాలా అనుబంధం ఉంది. టీమ్ఇండియాతో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ఏబీడీ.. ఐపీఎల్‌తో కోట్లమంది భారతీయులకు చేరువయ్యాడు. గతేడాదితో ఐపీఎల్ కెరీర్‌కు కూడా ముగింపు పలికాడు. ఈ క్రమంలో ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ భారత్‌తో పాటు తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"భారత క్రికెట్ జట్టులో చోటు దక్కాలంటే స్పెషల్ టాలెంట్ ఉండాల్సిందే. అలా అయితేనే అతడు టీమ్ఇండియాకు ఆడుతాడు. ఒకవేళ నేను ఇక్కడ పుట్టినాసరే, అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడిని కాదు. కానీ భారత్‌లో ప్రజలు ఆటగాళ్లను గుండెల్లో పెట్టుకుంటారు. ఇక్కడ నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే నేను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు భారత్‌లో ఉన్న అభిమానులు కూడా చాలా బాధపడ్డారు" అని డివిలియర్స్ చెప్పాడు.