ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆరో రోజుకు చేరుకుంది. వర్షం కారణంగా ఐదు రోజుల్లో పూర్తి ఆట సాధ్యం కాలేదు. ఫలితంగా ముందే ప్రకటించిన రిజర్వు డే వినియోగిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
'ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో రిజర్వు డేను ఉపయోగిస్తున్నాం. ఛాంపియన్‌షిప్ సైకిల్ ఆరంభంలోనే (2018) ఫైనల్‌కు రిజర్వు డే ఉంటుందని ప్రకటించాం. ఈ ఏడాది మే 28న టెస్టు నిబంధనలు తెలియజేసినప్పుడు మరోసారి గుర్తు చేశాం' అని ఐసీసీ తెలిపింది. ఆరో రోజైన బుధవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకే ఆట మొదలవుతుంది. మొత్తం 98 ఓవర్లు వేస్తారు. రిజర్వు డే ఆఖరి గంట మొదలవుతుందని అంపైర్లు ముందే సంకేతాలు ఇస్తారు.