World Cup Winning Captains :గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో.. జరిగే ప్రపంచకప్ ఫైనల్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారత్ వేదికగా నిర్వహించిన ఈ మెగా టోర్నీ ఈ మ్యాచ్‌తో ముగియనుంది. ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించని బీసీసీఐ.. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ తుది పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఆదివారం అహ్మదాబాద్ రానున్నారు. అయితే ఈ మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణ నిలిచేలా.. ఇప్పటివరకు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్లందరినీ ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆహ్వానించింది బీసీసీఐ.
1975 నుంచి 2019 వరకు ప్రపంచకప్ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్లకు ఈ తుదిపోరుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. క్లైవ్ లాయిడ్ మొదలుకొని కపిల్ దేవ్, ఎస్ ఎస్ ధోనీ, అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ సహా వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లు అందరూ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. వీరి అందరి రాకతో ఫైనల్ మరింత ఘనంగా మారిపోనుంది.
అయితే 1992లో పాకిస్థాన్ కప్పును కైవసం చేసుకుంది. అప్పటి కెప్టెన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు కూడా ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన ఈ ఫైనల్‌కు రాలేకపోతున్నారు. ఫైనల్ మ్యాచ్ చూసే సమయంలో ఈ లెజెండరీ కెప్టెన్లంతా ఓ స్పెషల్ బ్లేజర్ ధరిస్తారని తెలుస్తోంది.