తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Cup History : 1975 టు 2019.. వరల్డ్ కప్​ జర్నీలో ఆ రెండు జట్లే టాప్​! - kapil dev

World Cup History : ఆరు రోజుల్లో ప్రపంచకప్​ టోర్నీ ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన భారత్ ఈ ఏడాది కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 1975 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 ప్రపంచకప్‌లు జరగ్గా.. అందులో టీమ్ఇండియా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక 1975 నుంచి 2019 వరకు ఈ మెగా టోర్నీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఆ జర్నీని మీరు ఓ సారి చూసేయండి..

World Cup History
World Cup History

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 2:30 PM IST

World Cup History :రానున్న ప్రపంచకప్​కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వేళ.. దేశ విదేశాలకు చెందిన క్రికెటర్లందరూ వరల్డ్​ కప్​ వేదికలకు పయనమయ్యారు. ఇప్పటికే ప్రాక్టీస్​ మ్యాచ్​లతో సందడి సందడిగా మారిన స్టేడియాలు ఇంకొద్ది రోజుల్లో హోరా హోరీ పోరుకు వేదికగా మారనుంది. ఇక భారత్ చివరిసారిగా 2011 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఈ సారి కూడా కప్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే 1975 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 ప్రపంచకప్‌లు జరగ్గా.. అందులో టీమ్ఇండియా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక 1975 నుంచి 2019 వరకు ఈ మెగా టోర్నీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఆ జర్నీని మీరు ఓ సారి చూసేయండి..

1975 ప్రపంచ కప్ - క్రికెట్ ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ ఇంగ్లాండ్‌ వేదికగా జరిగింది. ఎస్. వెంకటరాఘవన్ నేతృత్వంలో భారత్​ తొలి ప్రపంచకప్​ ఆడింది. అయితే ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌లలో భారత్ 1 మాత్రమే గెలిచి 5వ స్థానంలో నిలిచింది. కాగా.. ఆ ఏడాది ప్రపంచకప్ విజేతగా వెస్టిండీస్ జట్టు నిలిచింది.

1975 ప్రపంచ కప్

1979 ప్రపంచ కప్ - ఈ సారి కూడా ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్​ వెనుతిరిగింది. ఈ క్రమంలో భారత్ 7వ స్థానంలో నిలిచింది. అయితే ఆ టర్నీలో వెస్టిండీస్ జట్టు రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

1979 ప్రపంచ కప్

1983 ప్రపంచ కప్ - మూడోసారి కూడా ప్రపంచకప్​ ఇంగ్లాండ్‌లోనే జరిగింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు భారత జట్టును బలహీనంగా పరిగణించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టీమ్ఇండియా ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. లీగ్ రౌండ్‌లో వెస్టిండీస్ వంటి బలమైన జట్టును ఓడించి తమ సత్తా చాటారు. అలా కపిల్ దేవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా తొలిసారి ప్రపంచకప్​ను ముద్దాడింది.

1983 ప్రపంచ కప్

1987 ప్రపంచ కప్- ఈ టోర్నీ భారత్​, పాకిస్థాన్​ సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇచ్చాయి. ఇక తొలిసారిగా ప్రపంచకప్‌ను 60 ఓవర్లకు బదులుగా 50 ఓవర్లలో నిర్వహించారు. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఇక హోరా హోరీగా జరిగిన ఫైనల్స్​లో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

1992 ప్రపంచ కప్ - న్యూజిలాండ్​తో పాటు ఆస్ట్రేలియా సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించాయి. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఈ ప్రపంచకప్‌లో మిశ్రమ ప్రదర్శన చేసింది. క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ ఈ టోర్నీతోనే ప్రపంచకప్​లోకి అరంగేట్రం చేశారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ జట్టు.. ఆ టోర్నిలో జరిగిన ఫైనల్స్​లో ఇంగ్లాండ్‌ జట్టును ఓడించి కప్​ను కైవసం చేసుకుంది.

1992 ప్రపంచ కప్

1996 ప్రపంచ కప్ - ఈ సారి జరిగిన టోర్నీకి భారత్​ ఆతిథ్యం ఇచ్చింది. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమ్ ఇండియా కెన్యా, వెస్టిండీస్‌లను ఓడించి శుభారంభం చేసింది. ఇక క్వార్టర్స్‌లో పాకిస్థాన్​ను మట్టికరిపించిన భారత్.. సెమీస్​లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఇక ఆ టోర్నీ ఫైనల్స్​లో కంగారూ జట్టును చిత్తు చేసి లంక జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది.

1996 ప్రపంచ కప్

1999 ప్రపంచ కప్ -ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్​ ఆతిథ్యం ఇచ్చింది. మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో నడిచిన టీమ్ఇండియా ఈ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచింది. లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లను ఓడించిన భారత్.. క్వార్టర్స్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఆ ఏడాది కప్​ను ఆస్ట్రేలియా జట్టు అందుకుంది.

1999 ప్రపంచ కప్

2003 ప్రపంచ కప్- సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్​ 2003లో ప్రపంచకప్​కు పోటీపడింది. దక్షిణాఫ్రికా తొలిసారి కప్​ కోసం ఆతిథ్య బాధ్యతలు చేపట్టింది.ఇక ఈ టోర్నీలో భారత జట్టు అద్భుతంగా రాణించి.. ఆస్ట్రేలియా మినహా అన్ని జట్లను చిత్తు చేసింది. అయితే ఫైనల్స్​లో జరిగిన ఉత్కంఠ పోరులో 125 పరుగుల భారీ తేడాతో ఆసిస్​ జట్టు విజయాన్ని అందుకుంది.

2003 ప్రపంచ కప్

2007 ప్రపంచకప్ - వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్​లో సచిన్ , గంగూలీ, ద్రవిడ్, యువరాజ్ సింగ్ లాంటి సూపర్ స్టార్లు ఆడారు. అయితే బంగ్లాదేశ్ వంటి బలహీన జట్టు చేతిలో ఓడిన భారత్​.. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అలా 9వ స్థానంలో సరిపెట్టుకుంది. ఇక రికీ పాంటింగ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు నాలుగోసారి ప్రపంచ ఛాంపియన్‌గా రికార్డుకెక్కింది.

2007 ప్రపంచకప్

2011 ప్రపంచ కప్ - క్రికెట్​ లవర్స్ ఎవరూ ఈ ప్రపంచకప్​ను అస్సలు మర్చిపోలేరు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచకప్​ను భారత్​ ముద్దాడుతున్న క్షణాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి కళ్లల్లో మెదులుతూనే ఉంటాయి. భారత్​, బంగ్లాదేశ్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో.. కెప్టెన్ కూల్​ ​ మహేంద్ర సింగ్ ధోనీ సారథిగా వ్యవహరించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా.. సెమీఫైనల్లో పాకిస్థాన్‌ జట్లను ఓడించిన భారత్​.. ఫైనల్లో శ్రీలంకను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

2011 ప్రపంచ కప్

2015 ప్రపంచ కప్ - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2015 ప్రపంచ కప్‌లో.. భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి సెమీ-ఫైనల్స్​కు చేరుకుంది. అయితే సెమీస్​లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన భారత్​.. మూడో సారి ప్రపంచకప్​ను అందుకోలేకపోయింది. ఇక ఫైనల్స్​లో న్యూజిలాండ్‌ను ఓడించి కంగారూ జట్టు.. 5వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది.

2015 ప్రపంచ కప్

2019 ప్రపంచ కప్ -ఇంగ్లాండ్​ ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు.. రన్నింగ్​ మెషిన్​ విరాట్ కోహ్లి సారథ్యంలో బరిలోకి దిగింది. అద్భుత ప్రదర్శనతో చేసి సెమీఫైనల్‌కు చేరుకున్న టీమ్ఇండియా..సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి పంచకప్ నుంచి నిష్క్రమించింది. అయితే ఫైనల్స్​లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఇంగ్లాండ్​.. తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

2019 ప్రపంచ కప్

Ravindra Jadeja World Cup 2023 : 'ఆ ఒక్క క్వాలిటీ వల్లే సూపర్​ ఫామ్​లో జడ్డూ.. నేనెలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు'

ODI World Cup 2023 : 'జట్టులో అతడిపైనే భారీ ఆశలు.. అలా ఆడితే విజయం పక్కా'

ABOUT THE AUTHOR

...view details