తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​ కప్​లో కొత్త మెరుపులు - సీనియర్స్​ ఉన్నా యంగ్​ ప్లేయర్ల హవా! - దిల్షాన్‌ మదుశంక వన్డే ప్రపంచకప్‌

World Cup 2023 Young Cricketers : 2023 వన్డే ప్రపంచకప్‌లో ఎంతో మంది స్టార్‌ ఆటగాళ్లు, సీనియర్​ ప్లేయర్లు అంచనాలకు తగ్గట్లే రాణిస్తున్నారు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌తోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. అయితే వీరి మధ్య కొత్త ప్లేయర్లు కూడా తక్కువేమీ కాదంటూ చెలరేగుతున్నారు. ఇంతకీ వారెవరంటే..

World Cup 2023 Young Cricketers
World Cup 2023 Young Cricketers

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 9:15 AM IST

World Cup 2023 Young Cricketers : ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో స్టార్‌ ఆటగాళ్లు, సీనియర్లు చాలామంది అంచనాలకు మించి రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో తమ సత్తా చాటి మెరుపులు మెరిపిస్తున్నారు. మంచి ఫామ్​ను ప్రదర్శిస్తున్నారు. అయితే వీరి మధ్య ఇప్పుడే అరంగేట్రం చేసిన క్రికెటర్లు కూడా తక్కువేమీ కాదు. తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు కూడా అంచనాలకు మించి రాణిస్తున్నారు. టోర్నీపై తమదైన ముద్ర వేస్తూ.. అభిమానుల దృష్టిలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్టార్​ ఆటగాళ్లు ఎవరంటే..

  1. న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ భారత సంతతి ప్లేయర్​ రచిన్‌ రవీంద్ర.. అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ చెలరేగుతున్నాడు. ప్రధానంగా స్పిన్నర్‌.. కానీ మిడిలార్డర్లో బ్యాటింగ్‌ చేసేవాడు. అయితే ఈ ప్రపంచకప్​లో కివీస్​ జట్టు రచిన్​కు టాప్‌ ఆర్డర్లో ఆడించి చూసింది. వారి అంచనాలను మించి ఆడి రికార్డుకెక్కాడు. టోర్నీలో మూడో స్థానంలో బరిలోకి దిగుతున్న రచిన్​.. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో ఏకంగా మూడు శతకాలు బాదాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ లాంటి బలమైన టీమ్స్​ మీదే అతను ఈ శతకాలు సాధించడం విశేషం. ముఖ్యంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లపై ఛేదనలో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ.. సెంచరీలు కొట్టి తన బ్యాటింగ్‌ ప్రతిభను చాటుకున్నాడు. బంతితో ఎక్కువ వికెట్లు తీయకపోయినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ జట్టుకు సహకారంగా ఉంటున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 70.62 సగటుతో 565 పరుగులు సాధించి టోర్నీలో టాప్‌-2 స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు టోర్నీలో రచిన్​ 3 శతకాలు, 2 అర్ధశతకాలు సాధించాడు.
  2. 2023 వరల్డ్ కప్​లో సౌతాఫ్రికా సెమీస్‌ చేరడంలో ఆ జట్టులో ఓ ప్లేయర్​ది కీలక పాత్ర ఉంది. అతనే మార్కో జాన్సన్‌. బౌలింగ్‌లో రబాడ, ఎంగిడి లాంటి సీనియర్​ ప్లేయర్ల కంటే అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడమే ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలుగా మారింది. ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో అతను 24.41 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇక టోర్నీలో అత్యధిక వికెట్ల తీసిన స్టార్స్​లో జాన్సన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆరున్నర అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న జాన్సన్‌.. మీదికి దూసుకొచ్చేలా, బ్యాటర్లు ఆడలేని విధంగా బంతులు సంధిస్తూ చెలరేగుతున్నాడు. అటు బౌలింగ్​తోనే కాదు ఇటు బ్యాటింగ్‌తోనూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. లోయర్‌ మిడిలార్డర్లో ఆడుతూ టోర్నీలో 157 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌పై 42 బంతుల్లో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ అతని కెరీర్​లో ప్రత్యేకమైనది.
  3. శ్రీలంక జట్టు చెందిన యంగ్​ పేసర్‌ దిల్షాన్‌ మదుశంక బౌలింగ్​తో అదరగొడుతున్నాడు. జట్టు ఘోరంగా విఫలమైన మ్యాచ్‌ల్లోనూ అత్యద్భుతంగా ఆడుతున్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక జట్టు 55 పరుగులకే ఆలౌటైనప్పటికీ.. ఆ మ్యాచ్‌లోనూ మదుశంక 5 వికెట్లతో మెరిశాడు. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ తప్ప అన్నింట్లోనూ కనీసం 2 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు కూడా దిల్షానే కావడం విశేషం. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 25 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతని ఎకానమీ 6.70. అయిదు వికెట్ల ప్రదర్శన చేసిన మదుశంక.. మరో మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.
  4. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్‌ జట్టు సూపర్ ఫామ్​లో ఉంది. ముఖ్యంగా బౌలింగ్‌, స్పిన్లతో బడా బడా జట్లకే సవాళ్లు విసురుతూ వచ్చింది. ఇక బౌలర్లు ఎప్పట్లాగే రాణిస్తుంటే.. ఆ జట్టు బ్యాటర్లు కూడా అంచనాలను మించి రాణించారు. ఇక బ్యాటింగ్​ విభాగాన్ని ముందుండి నడిపించింది మాత్రం ఆ జట్టు యంగ్​ ప్లేయర్​ ఇబ్రహీం జాద్రానే. యంగ్​ ఓపెనర్‌ ఇచ్చిన ఆరంభాలే జట్టు సంచలన విజయాల్లో కీలకంగా మారాయి. టోర్నీలోని ప్రతి మ్యాచ్‌లోనూ రెండంకెల స్కోర్లు చేశాడు ఇబ్రహీం. పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్​లో 87 పరుగుల ఉత్తమ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఆస్ట్రేలియాపై ఏకంగా సెంచరీ బాది అందరినీ అబ్బురపరిచాడు. ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌ కూడా జాద్రానే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 47 సగటుతో 376 పరుగులు సాధించాడు.
  5. అఫ్గానిస్థాన్‌ జట్టుకు చెందిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ అదరగొట్టాడు. భారత్‌పై 62 పరుగులు చేసిన ఈ యంగ్​ ప్లేయర్​.. శ్రీలంకపై జరిగిన మ్యాచ్​లో 73 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయ పథంలో నడిపించాడు. దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్‌లోనూ అసాధారణంగా ఆడి.. అజేయంగా 97 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఈ టోర్నీలో అజ్మతుల్లా 7 వికెట్లు కూడా తీశాడు.
  6. సౌతాఫ్రికా ప్లేయర్​ కొయెట్జీ కూడా ఈ వరల్డ్​ కప్​లో ఆకట్టుకున్నాడు. 18 వికెట్లతో మెరిసిన ఈ స్టార్​ ప్లేయర్​​ను.. తన వేగం, దూకుడు చూసి స్టెయిన్‌తో పోలుస్తున్నారు విశ్లేషకులు. ఇక బ్యాటింగ్‌లోనూ రాణించాడు కొయెట్జీ.
  7. పాకిస్థాన్‌ జట్టుకు చెందిన అబ్దుల్లా షఫీక్‌ కూడా తన ఫామ్​తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 7 మ్యాచ్‌ల్లో 48 సగటుతో 336 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉండటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details