World Cup 2023 Viewership Worldwide : దాదాపు నెలన్నర రోజుల పాటు సాగిన 2023 వన్డే వరల్డ్ టోర్నీ.. క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. టీమ్ఇండియా ఆడిన మ్యాచ్‌లకు వేల సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియాలకు హాజరయ్యారు. నాన్ ఇండియా మ్యాచ్‌లకు కూడా భారీగా అభిమానులు తరలివచ్చారు. వరల్డ్ కప్ మొత్తంలో దాదాపు 12 లక్షల మంది స్టేడియాల్లో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను చూశారు.
అయితే నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా దాదాపు 1.3 లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా టీవీల్లో లైవ్‌లో దాదాపు 30 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన కార్యక్రమంగా ఈ మ్యాచ్ నిలిచిందన్నారు.
డిజిటల్లో రికార్డు బద్దలు..
Hotstar Highest Live Watching :క్రికెట్లో అతిపెద్ద టోర్నమెంట్లో ఆస్ట్రేలియా ఫైనల్లో భారత్‌ను ఓడించి.. 2023 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. అయితే స్వదేశంలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ఫైనల్‌కు చేరుకోవడం.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపింది. దీంతో నవంబర్ ఆదివారం 19న జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఎప్పుడూ లేనంత క్రేజ్ దక్కింది. భారత్ ప్రపంచకప్ టోఫ్రీని ముద్దాడుతుంటే చూద్దామని, అహ్మదాబాద్ స్టేడియానికి దాదాపు 1.2 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టాస్ గెలిచిన ఆసీస్.. టీమ్ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ఆరంభంలో అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీతో కలిసి.. కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో 5.9 కోట్ల మంది లైవ్ చూశారు. దీంతో వ్యూయర్‌షిప్ పరంగా.. ఈ ఫైనల్ మ్యాచ్ గత రికార్డు (5.3 కోట్లు)ను బద్దలుకొట్టింది. అయితే ఇప్పటివరకు హాట్‌స్టార్‌లో నమోదైన అత్యధిక వ్యూయర్‌షిప్ ఇదేనని సంస్థ హెడ్ సాజిత్ శివానంద్ తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో క్రికెట్ మ్యాచ్ చూడా ఇదే తొలిసారి.
మాజీ క్రికెటర్‌పై ఐసీసీ వేటు- ఆరేళ్ల పాటు నిషేధం- ఎందుకో తెలుసా?
మొదలైన ఐపీఎల్ 2024 ఫీవర్- మినీ వేలంలో 590 మంది ప్లేయర్లు!