World cup 2023 Team India : ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌ను ప్రపంచకప్ సన్నాహకం కోసం ఉత్తమంగా ఉపయోగించుకోవాలని రోహిత్ సేన చూసింది. ఈ క్రమంలో తొలి రెండు వన్డేల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇక రెండో వన్డేలో అయితే ఏకంగా 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే వర్షం అంతరాయం కారణంగా 99 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో టీమ్‌ఇండియాకు ఇక తిరుగులేదనిపించింది. కానీ మూడో వన్డేకు వచ్చే సమయానికి మరోసారి భారత జట్టు బలహీనంగా మారిపోయింది. ఈ మ్యాచ్ ఓటమితో జట్టు పరిస్థితి గురించి ఒక్కసారిగా బయటపడింది. అయితే ప్రపంచకప్‌కు ముందు ఈ ఓటమి జట్టుకు మేలు చేసేదే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరాజయం నుంచి వచ్చే పాఠాలు.. ప్రపంచకప్‌లో భారత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఒక్క మ్యాచ్ అని అనుకుంటే..
Ind Vs Aus ODi 2023 : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేలను దిగ్విజయంగా గెలిచిన టీమ్ఇండియా.. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన ఏమవుతుందిలే అని అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమే అని భావించాలి. విశ్వ విజేతగా నిలవాలంటే ప్రతి మ్యాచ్‌ను కూడా ఎంతో కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రానున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. ఈ క్రమంలో 10 జట్లు పోటీపడే టోర్నీలో.. మొదట ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
ఈ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. మిగతా వాటిల్లో గెలిచి ముందంజ వేయొచ్చు. ఈ దశ ముగిసే సరికి తొలి నాలుగులో ఉన్న జట్లు నేరుగా సెమీస్ ఆడతాయి. కానీ అక్కడి నుంచే అసలైన పరీక్ష మొదలవుతుంది. ఇక్కడ ఒక్క మ్యాచ్ ఓడినా సరే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అత్యంత తీవ్రత, ఒత్తిడి ఉండే ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు మాత్రమే విజేతగా నిలుస్తుంది. ఈ విషయం టీమ్‌ఇండియాకు తెలియనిదేమి కాదు. 2011 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఆ తర్వాత వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టింది. కాబట్టి రానున్న పోరులో నిలకడ కొనసాగించడం ఎంతో ముఖ్యం.
పట్టు వదలొద్దు..
ప్రపంచకప్‌ను ముద్దాడాలంటే పట్టు వదలకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో మెప్పించి.. మరో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో తుస్సుమనిపిస్తే ఆటకు ప్రయోజనం ఉండదు. ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శిస్తేనే ఛాంపియన్‌గా నెగ్గుతాం.