World Cup 2023 Team India : ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్ ఆరంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ పోరులో పాల్గొనేందుకు రెడీ అవుతున్న పది జట్లు.. వార్మప్ మ్యాచ్‌లో తమ సత్తా చాటుతూ దుసుకెళ్తున్నారు. ఇక తాజాగా టీమ్ఇండియా కూడా ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లో విజృంభించి ఎలాగైన వరల్డ్ కప్‌ను సాధించాలన్న కసితో ఉంది. ఈ క్రమంలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా భారత్ - ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ హోరా హోరీ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
రోహిత్ శర్మ నేతృత్వంతో మేటి ప్లేయర్స్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఈ తుది జట్టు కూర్పుపై ఎందరో క్రికెట్ మాజీలు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ క్రమంలో తాజాగా టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే కూడా వ్యాఖ్యానించారు. జట్టులోని బౌలర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
"మన వద్ద అత్యుత్తమ జట్టు ఉంది. అందరికీ ఆటపై మంచి బ్యాలెన్స్ ఉంది. అయితే మనకు కలిసొచ్చే అంశం ఏంటంటే.. టీమ్ఇండియాలో ఉన్న బౌలర్లందరూ వికెట్లు తీసి సత్తా చాటినవాళ్లే. గాయాలను కూడా పట్టించుకోకుండా.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. 2023 ప్రపంచకప్‌కు భారత ఆటగాళ్లందరూ సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా భారత జట్టుకు బ్యాటింగ్ ఓ సపోర్ట్ సిస్టంలా ఉండగా.. ఇప్పుడు బౌలింగ్ కూడా అంతలానే ప్రాధాన్యత సంతరించుకుంటోంది" అని కిరణ్ అన్నారు. మరోవైపు భారత జట్టులోని కొందరు ప్లేయర్లును ఆయన కొనియాడారు. తమకున్న గొప్ప నైపుణ్యంతో టీమ్ఇండియా కచ్చితంగా సెమీస్‌కు చేరుకుంటుందని ఆయన అన్నారు.