World Cup 2023 Stadium Record :భారత్ వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల ప్రపంచకప్ ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొన్నాయి. హోరా హోరీగా మ్యాచ్‌లు జరిగాయి. ఆ మ్యాచ్‌లకు భారత్‌లోని వివిధ స్టేడియాలు వేదికయ్యాయి. వాంఖడే, అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీ స్టేడియం ఇలా పలు స్టేడియాలు ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఇండియాతో పాటు ఆయా జట్లకు చెందిన అభిమానులు ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చారు. టీమ్ఇండియా ఆడిన మ్యాచ్‌లకు రికార్డు స్థాయిలో అభిమానులు స్టేడియాలకు తరలివచ్చారు. అయితే భారత్ ఆడిన మ్యాచ్‌లు మాత్రమే కాకుండా.. నెదర్లాండ్స్, పాకిస్థాన్, వంటి దేశాలు ఆడిన నాన్ ఇండియా మ్యాచ్‌లకు కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే తాజాగా ఈ వరల్డ్ కప్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
2019లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీకి 10 లక్షల 16 వేల మంది హాజరుకాగా.. ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య మరింత పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగిన మ్యాచ్‌లను స్టేడియంలో చూసిన ప్రేక్షకుల సంఖ్య 12 లక్షల 50 వేల 307కు చేరింది. ఇక ఫైనల్ మ్యాచ్‌ని స్టేడియంలో 92,453 మంది వీక్షించారు. అయితే మెల్‌బోర్న్ వేదికగా 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, అత్యధిక మంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ను 93,013 మంది వీక్షించారు.