World Cup 2023 Semi Final : ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నీలో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నాయి. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న ఈ జట్లు మరికొద్ది సేపట్లో ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలోనూ తొలి రెండు స్థానాలను ఆక్రమించిన ఈ టీమ్స్..ఇప్పుడు టాప్ ప్లేస్ కోసం పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. అయితే 2023 టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఈ రెండు జట్లు.. సెమీ ఫైనల్స్ చేరుకోవడం దాదాపుగా ఖాయమైనట్టే అనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ రేసు నుంచి తప్పుకోవడం అసాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.
లీగ్ దశలో భారత్ మరో నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత రోహిత్ సేన.. ఈ నెల 29న తన తదుపరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఇలా వరుసగా వేర్వేరు జట్లతో పోటీపడి సెమీస్‌కు చేరుకోనుంది టీమ్ఇండియా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా జట్లు కూడా కప్‌ను గెలవాలన్న కసితో బరిలోకి దిగుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. చిన్న జట్టు అని తేలిగ్గా తీసుకున్న అఫ్గాన్ కూడా ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించింది. దీని బట్టి చూస్తుంటే ఎవ్వరిని తక్కువ అంచనా వేయలేమని అర్థమైంది.
ఇక వరుస ఓటములతో సతమతమౌతున్న ఇంగ్లాండ్.. క్రమక్రమంగా తమ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతోంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ను ఓడించడం రోహిత్ సేనకు కష్టమైన పని కాదు. ఇక శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా అంతంతమాత్రంగానే ఆడుతున్నాయి. అయితే ఈ లీగ్ దశలో టీమ్ఇండియాను భయపెట్టే జట్టు ఏదైనా ఉంది అంటే అది ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే. వారితో ఆడి ఓడిపోయినా కూడా భారత్‌కు పెద్ద నష్టం ఏం జరగదు. లీగ్ దశలో ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లో రెండింట్లో నెగ్గినా కూజా సెమీ ఫైనల్స్ వెళ్లే ఛాన్స్ ఉంది.
మరోవైపు న్యూజిలాండ్ మాత్రం లీగ్ దశలోనే బలమైన జట్లను ఎదుర్కొవాల్సి ఉంది . దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక ఇలా నాలుగింటితో ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఆ జట్టుకు కావాల్సినంత నెట్ రన్‌రేట్‌ను అందుబాటులో ఉంది. అయిత్ ఈ జట్టు కూడా లీగ్ దశలో రెండింట్లో గెలిచినా కూడా సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.