World Cup 2023 India Winning Chances : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ రానే వచ్చింది ఇప్పటికే అన్ని దేశాలు ఈ మెగా టోర్నీ కోసం సంసిద్ధమయ్యాయి. 2011 తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుండటం వల్ల ఈసారి ఎలాగైనా కప్పును కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు తలపడనుంది. లీగ్ దశలో మిగిలిన తొమ్మిది జట్లతో భారత్ మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడనుంది. రోహిత్ సేన సెమీస్‌కు చేరడం ఖాయమని మాజీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని రాణిస్తే భారత్ ప్రపంచకప్ గెలవడం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు టీమిండియా అయోమయస్థితిలో ఉండేది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్, గాయాలు ఇలా ఎటుచూసిన సమస్యలే కనిపించేవి. కానీ జట్టు ప్రకటన తర్వాత ఒక్కో సమస్య పరిష్కారమైంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్, ఫామ్ మీద ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ఆసియా కప్‌లో పాక్‌పై రాహుల్ ఆస్ట్రేలియా సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుత శతకాలు బాది ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు.
ప్రధాన పేసర్ బుమ్రా గాయపడి జట్టుకు దూరం కావడం వల్ల మన పేస్ విభాగం ఒక్కసారిగా బలహీన పడింది. వెన్ను గాయంతో సుదీర్ఘ కాలం ఆటకు దూరమైన బుమ్రా.. గత నెలలో ఫిట్‌నెస్ సాధించి ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా వెళ్లాడు. అక్కడ ఫిట్‌నెస్, ఫామ్ చాటుకుని జట్టుకు కొండంత భరోసానిచ్చాడు. బుమ్రా భాగస్వామ్యంలో సిరాజ్ కూడా ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన షమి మూడో పేసర్‌గా ఖరారైపోయాడు. దీంతో భారత పేస్ విభాగం పటిష్టంగా మారింది. జడేజా, కుల్‌దీప్‌లకు తోడు అశ్విన్ చేరడం వల్ల భారత స్పిన్ విభాగానికి వైవిధ్యం తెచ్చింది.