తెలంగాణ

telangana

ETV Bharat / sports

షమీ వికెట్ల మ్యాజిక్​ - మ్యాక్స్​వెల్​ ఫాస్టెస్ట్ సెంచరీ - ప్రపంచకప్​లో టాప్ 10 హైలైట్స్ ఇవే! - వన్డే ప్రపంచకప్​ 2023 స్క్వాడ్

World Cup 2023 Highlights : వన్డే ప్రపంచకప్​2023 టోర్నీ ముగిసింది. 10 జట్లు పోటా పోటీగా తలపడ్డాయి. ఆఖరికి ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మరెన్నో విషయాలు హైలెట్​గా నిలిచాయి. అలాంటి 10 హైలెట్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందామా..

World Cup 2023 Highlights
World Cup 2023 Highlights

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 6:40 AM IST

World Cup 2023 Highlights :భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ పూర్తయింది. 10 జట్లు తలపడిన ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచి ఆరోసారి కప్పు సాధించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించింది. అయితే ఈ టోర్నీలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. అలాంటి 10 హైలెట్స్ గురించి ఓ లుక్కేద్దాం.

  1. 49 బంతుల్లోనే సెంచరీ
    టోర్నీ ప్రారంభమైన రెండు రోజుల్లోనే వరల్డ్ కప్​లో ఓ వేగవంతమైన సెంచరీ నమోదైంది. దక్షిణాఫ్రికా ప్లెయర్​ ఎయిడన్​ మార్క్రమ్.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 49 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. ఆ మ్యాచ్​లో మిగతా ఆటగాళ్లు సైతం రాణించడం వల్ల సఫారీ జట్టు 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో లంకపై 102 పరుగుల తేడాతో గెలిచింది.
  2. 345 పరుగులు భారీ స్కోరు ఛేజింగ్
    ఈ టోర్నీలో భారీ స్కోర్​ను ఛేజ్ చేసి పాకిస్థాన్ జట్టు ఓ అరుదైన రికార్డు సృష్టించింది. హైదరాబాద్ వేదికగా శ్రీలంక తో జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు .. కుశాల్ మెండిస్, సమర విక్రమలు సెంచరీలు చేయడం వల్ల 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన పాక్ ఆటగాళ్లు మహమ్మద్ రిజ్వాన్ (131), షఫీక్ (113) లు సైతం శతకాలు చేయడం వల్ల 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  3. ఇంగ్లాండ్​కి షాక్ ఇచ్చిన అఫ్గాన్
    పసికూన అఫ్గానిస్థాన్‌ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్​ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. 285 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​.. 215 పరుగులకే ఆలౌటై 69 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇది జరిగిన వారం రోజులకు పాక్​తో జరిగిన మ్యాచ్​లోనూ అఫ్గాన్.. ఆ జట్టును ఓడించి షాక్ ఇచ్చింది. 283 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి దృష్టి మొత్తం తన వైపు తిప్పుకుంది.
  4. గ్లెన్​ మాక్స్​వెల్ ఫాస్టెస్ట్ సెంచరీ
    మార్కమ్ కొట్టిన వేగవంతమైన సెంచరీ రికార్డును ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్​వెల్ వారంలోనే బద్దలు కొట్టాడు. దిల్లీ వేదికగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో మ్యాక్స్​వెల్ సెంచరీతో 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో తడబడ్డ డచ్ టీమ్.. 21 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్​లో మ్యాక్సీ చేసిన సెంచరీ ఓవరాల్​గా వన్డేల్లో నాలుగో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.
  5. హైయ్యెస్ట్ స్కోరింగ్ గేమ్
    వన్డే ప్రపంచకప్​లో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఓ రికార్డు క్రియేట్ చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో హైయ్యెస్ట్ స్కోరింగ్​ను ఈ మెగా టోర్నీ వేదికగా నమోదు చేసింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. 388 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 109 పరుగులు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ యంగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర సైతం సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆ మ్యాచ్ లో ఇరు జట్లు కలిసి 771 రన్స్ కొట్టాయి. ఒక వరల్డ్ కప్ గేమ్ లో హైయ్యెస్ట్ స్కోర్ కొట్టిన మ్యాచ్​గా నిలిచింది. అంతకంటే ముందు దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్​లో 754 పరుగులు నమెదయ్యాయి.
  6. షమీ మ్యాజిక్
    సెమీఫైనల్స్​కి ముందు శ్రీలంకతో జరిగిన పోరులో భారత బౌలర్ మహమ్మద్ షమీ 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు 357 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన లంక జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రోహిత్​ సేన 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించి సెమీస్​లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది.
  7. మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం
    146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ లో 'టైమ్డ్ అవుట్' అయిన తొలి ఆటగాడిగా శ్రీలంక ప్లేయర్​.. ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. దిల్లీ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో బ్యాటింగ్​కు వచ్చిన మాథ్యూస్.. రెండు నిమిషాల వ్యవధిలో స్ట్రైక్ చేయడంలో విఫలం కావడం వల్ల అతడ్ని ఎంపైర్లు ఔట్​గా ప్రకటించారు. ఆ అప్పీలును ఉపసంహరించుకోవడానికి బంగ్లా కెప్టెన్ షకీబ్ నిరాకరించాడు. తమ జట్టు గెలిచేలా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
  8. ఆల్ టైమ్ వన్డే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్
    తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో, పీకల్లోతు కష్టాల్లో పడ్డ తన జట్టును అజేయమైన డబుల్ సెంచరీ చేసి ఆదుకున్నాడు ఆస్ట్రేలియా ప్లేయర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్. ముంబయి వేదికగా అఫ్గాన్​తో జరిగిన పోరులో 292 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగింది. కంగారూలకు ఆ లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఒకానొక దశలో 91/7 తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ కొట్టాడు. ఒకవైపు కాలు, వెన్ను నొప్పితో బాధపడుతున్నా.. అవేవీ లెక్కచేయకుండా తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్​గా, ప్రపంచ కప్​లో డబుల్ సెంచరీ చేసిన మూడో ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు.
  9. వన్డేల్లో విరాట్ 50 వ సెంచరీ
    ఈ ప్రపంచ కప్​లోనే టీమ్ఇండియా ప్లేయర్​ విరాట్ కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్​తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్​లో విరాట్ దీన్ని సాధించాడు. అప్పటిదాకా ఆ రికార్డు సచిన్ పేరు మీద ఉండేది.
  10. ఫైనల్​లో ట్రావిస్ హెడ్ సెంచరీ
    టీమ్ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 137 పరుగుల భారీ స్కోరు తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. మంచి పరుగులు సాధిస్తచూ ఊపు మీదున్న రోహిత్ శర్మను క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. దీంతో భారత్ స్కోరు నెమ్మదించి ప్రత్యర్థి జట్టు ముందు స్వల్ప లక్ష్యాన్నే ఉంచగలిగింది.

ABOUT THE AUTHOR

...view details