World Cup 2023 Final :వన్డే ప్రపంచకప్ ఫైనల్ భాగంగా జరిగిన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆస్ట్రేలియాదే పై చేయిగా నిలిచింది.హోరా హోరీగా జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయర్లు తమ శాయశక్తులా పోరాడినప్పటికీ.. విజయం కంగారూలనే వరించింది. దీంతో టీమ్ఇండియా డీలా పడింది. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆ జట్టు.. ఇలా ఫైనల్స్‌లో ఓటమి పాలవ్వడం పట్ల అటు అభిమానులతో పాటు ఇటు జట్టు సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన ఆయన.. జట్టు సభ్యులను మోటివేట్ చేస్తూ.. వాళ్లల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు.
ఓటమనేది సాధారణమైనది, దాన్ని చూసి నిరుత్సాపడకూడదని మోదీ అన్నారు. అంతే కాకుండా ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన వరుసగా పది మ్యాచ్‌లను గెలిచిన తీరును వారికి గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండి అంటూ కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఓదార్చారు. జట్టులోని సభ్యులు ఒకరినొకరు ఎప్పుడూ ప్రోత్సహించుకోవాలని అన్నారు. మిగతా ప్లేయర్లకు కరచాలనం ఇచ్చి అభినందించారు. షమీని హగ్ చేసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అంతకుముందు ట్విట్టర్ వేదికగా భారత జట్టును ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. "ప్రియమైన టీమ్‌ఇండియా.. ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, పట్టుదల గుర్తుంచుకోదగ్గవి. మీరు గొప్ప ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ రోజు, ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం" అంటూ రోహిత్ సేనకు సపోర్ట్ చేశారు.