World Cup 2023 Black Tickets : వరల్డ్ కప్ పేరిట రోజుకో మోసం బయటపడుతోంది. బ్లాక్ టికెట్ల దందాతో విక్రేతలు ఎంతో మంది అభిమానులను బోల్తా కొట్టిస్తున్నారు. మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధర ఉన్న టిక్కెట్లను సైతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటీవలే భారత్ -సౌతాఫ్రికా మ్యాచ్ సమయంలో ఇదే పరిస్థితి నెలకొనగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బ్లాక్ టికెట్ విక్రేతలు రెచ్చిపోయారు. టికెట్లను హాట్‌కేకుల్లా అమ్మడం మొదలెట్టారు. ఆఖరికి పోలీసుల చొరవతో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.
అసలేం జరిగిందంటే ?
India Vs Newzealand Semi Finals Tickets :వాంఖడే స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే టికెట్లు అందుబాటులోకి రాగా.. అవన్నీ త్వరగానే అమ్ముడైపోయాయి. దీంతో క్రికెట్ లవర్స్ టికెట్ల కోసం వేట మొదలెట్టారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి.. సుమారు రూ.2500 నుంచి రూ.4000 ఉన్న మ్యాచ్ టిక్కెట్‌ను రూ. 27,000 నుంచి రూ. 2,50,000 ధరకు అమ్మాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు మలాడ్‌కు చెందిన ఆకాశ్ కొఠారి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్ కేసును నమోదు చేసి తదుపరి దర్యాప్తను ముమ్మరం చేశారు.