World Cup 2023 Ambassador :2023 వన్డే ప్రపంచకప్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత దిగ్గజం, భారత రత్న సచిన్ తెందూల్కర్‌ను ఈ మెగాటోర్నీకి గ్లోబల్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఇక అక్టోబర్ 4వ తేదీ బుధవారం అహ్మదాబాద్‌లో జరగనున్న ఓపెనింగ్ ఈవెంట్లో మాస్టర్ బ్లాస్టర్ ట్రోఫీని ఆవిష్కరించనున్నారు.
ఈ గౌరవం అందుకున్న సచిన్.. " 1987లో బాల్‌బాయ్‌గా ఉన్న నేను, 6 వరల్డ్‌కప్ ఎడిషన్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక 2011లో భారత్.. విశ్వకప్ విజేతగా నిలవడం నా క్రికెట్ కెరీర్లో గర్వకారణం. ప్రపంచంలోని మేటి జట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొనేందకు భారత్‌కు వచ్చాయి. ఈ టోర్నీని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అలాగే అనేక మంది యువకులను.. తమతమ దేశాలకు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించేలా ఈ టోర్నీ ప్రేరేపిస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు.
మాస్టర్ బ్లాస్టర్‌ను గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించిన ఐసీసీ.. టోర్నీని మరింత గ్రాండ్‌గా మార్చడానికి మరికొంత మంది ఆటగాళ్లను అంబాసిడర్లుగా ప్రకటించింది. వారిలో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా హిట్టర్ అరోన్ ఫించ్, శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్, టీమ్ఇండియా బ్యాటర్ సురేశ్ రైనా, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఉన్నారు.
ఈ వన్డే వరల్డ్‌కప్‌నకు గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్‌ను నియమించడం గౌరవంగా భావిస్తున్నాము. ఈ ఎడిషన్ పురుషుల ప్రపంచకప్ అన్నింటిలోకెల్లా ప్రత్యేకంగా ఉంటుందని నమ్ముతున్నాము. తెందూల్కర్ సహా తొమ్మిది మంది దిగ్గజాలు అంబాసిడర్లుగా ఉన్నారు. ఇక టోర్నమెంట్ ప్రారంభమయ్యే దాకా మేము వెయిట్ చేయలేము.