World Cup 2023 Afghanistan :ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమైంది. ఈ హోరాహోరీ సమరంలో 10 జట్లు తలపడనున్నాయి. అందులో చిన్న నుంచి పెద్ద జట్లు కూడా ఉన్నాయి. అయితే చిన్న జట్లుగా పేరున్నప్పటికీ.. కొన్నింటిని తక్కువ అంచనా వేయలేం. అలా అనుకున్న జట్లు క్రీజులోకి బలహీనంగా దిగి.. నెమ్మదిగా తమ బలాన్ని నిరూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో అఫ్గానిస్థాన్ కూడా ఒకటి.
కుర్రాళ్లు అంటూ కొట్టిపారేసిన ఆ జట్టు ఇప్పుడు టాప్ జట్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. నిరుడు ఆసియా కప్‌లోనూ చెలరేగి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ అఫ్గాన్ టీమ్ ఎన్నో అద్భుతాలు సృష్టించనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలో బరిలోకి దిగనున్న అఫ్గాన్ జట్టులో ప్రపంచకప్‌లో కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఈ జట్టులోని అయిదుగురు ప్లేయర్లు మ్యాచ్‌ను ప్రభావితం చేయగలరు. మరి వారెవరంటే?
- రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ జట్టులో అత్యంత కీలక ఆటగాడు. 25 ఏళ్ల రషీద్.. అంతర్జాతీయ క్రికెట్లో ఒక సంచలనంగా ఎదిగాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో బంతితోనే కాకుండా.. బ్యాట్ తోనూ మ్యాజిక్ చేయగలడు. ఇప్పటి వరకు తాను ఆడిన 94 వన్డేల్లో 4.21 ఎకానమీతో 172 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 5 అర్ధ సెంచరీలు సహా మొత్తం 1211 పరుగులు సాధించాడు. - ముజీబ్ రెహమాన్
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టులో ముజీబ్ రెహమాన్ మరో కీలక ప్లేయర్‌గా రాణిస్తున్నాడు. ఆ జట్టు తరఫున ఇప్పటివరకు వన్డేల్లో అద్భుత ప్రదర్శనలు చేశాడు. 66 వన్డేల్లో 93 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 4.15గా ఉంది. ఇక బౌలింగ్‌లో అతని ఉత్తమ ప్రదర్శన 50-5గా ఉంది. మరోవైపు ఇప్పటి వరకు తాను ఆడిన మ్యాచుల్లో మొత్తం 185 పరుగులు కొట్టాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. - మహమ్మద్ నబీ
అఫ్గాన్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ మహమ్మద్ నబీఈ జట్టుకు మరో కీలక ప్లేయర్. ఇప్పటి వరకు నబీ 47 వన్డేల్లో 3153 పరుగులు సాధించాడు. అందులో ఒక శతకం, 16 అర్ధ శతకాలున్నాయి. ఇతని హైయ్యెస్ట్ స్కోరు 116. యావరేజ్ 27.18 కాగా, స్ట్రైక్ రేట్ 86.17 గా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. 4.29 ఎకానమీతో 154 వికెట్లు పడగొట్టాడు. - ఇబ్రహీం జర్దన్
ఇబ్రహీం జర్దన్ అఫ్గాన్ టీమ్‌లో టాప్ బ్యాటర్. 21 ఏళ్ల ఈ యువ సంచలనం.. 2018 లో అండర్ - 19 వరల్డ్ కప్ ఆడాడు. ఆ టోర్నీలో అఫ్గాన్ తరఫున లీడింగ్ స్కోరర్‌గానూ రికార్డుకెక్కాడు. 2019లో టెస్టు ఫార్మాట్‌కి ఎంపికైన ఈ కుర్రాడు.. బంగ్లాదేశ్ తరఫున జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది నవంబరులో వెస్టిండీస్‌పైన వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతను ఇప్పటి వరకు 19 వన్డేలు ఆడి 911 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలతో పాటు పలు అర్ధ సెంచరీలూ ఉన్నాయి. అత్యధిక స్కోరు 162. యావరేజ్ 53. 38 కాగా, స్ట్రైక్ రేట్ 84.35. - రహమనుల్లా గుర్బాజ్
ఈ టోర్నీలో రహమనుల్లా గుర్బాజ్ అఫ్గాన్ జట్టుకు అత్యంత కీలకం కానున్నాడు. గత కొన్ని రోజులుగా ఇతని ప్రదర్శన అద్భుతంగా ఉండటమే దీనికి కారణం. అతను ఇప్పటి వరకు 26 వన్డేల్లో 958 పరుగులు కొట్టాడు. ఇందులో 5 శతకాలు, 2 అర్ధ శతకాలున్నాయి. అత్యధిక పరుగులు 151 పరుగులు. 38.32 యావరేజ్, 134.58 స్ట్రైక్ రేటు సాధించాడు. అఫ్గాన్ కు ఈ టోర్నీలో శుభారంభం అందించడం గుర్బాజ్ చేతులమీదే ఉంది.