World Cup 2023 Afghanistan : వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయాలు సాధిస్తోంది. ఆడిన ఆరు మ్యాచ్‌లుల్లోనూ మూడింటిలో నెగ్గి మంచి ఫామ్‌లో ఉంది. టోర్నీ తొలి మ్యాచ్‌లలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని చవి చూసిన అఫ్గాన్.. ఆ తర్వాత వేగం పుంజుకుని తాజాగా ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లను చిత్తు చేసింది. అంతే కాకుండా సోమవారం(అక్టోబర్ 30)న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో హ్యాట్రిక్ కొట్టి షాకిచ్చింది.
ఒకప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన ఆ మూడు జట్లను ఓడించడం అంటే అంత సులభం కాదు. కానీ అటువంటి బలమైన టీమ్స్‌నే ఇంటిదారి పట్టించేలా చేసింది అఫ్గాన్ జట్టు. శ్రీలంకపై విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన అఫ్గన్ జట్టు.. తమకున్న సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు టాప్-4లో నిలిచేందుకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం.
ఇప్పుడున్న పాయింట్ల పట్టికలో అఫ్గాన్ కంటే ముందు భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, సౌతాఫ్రికాతో అఫ్గాన్ జట్టు ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్ భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. దీంతో ఆస్ట్రేలియా కూడా ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచినా సరిపోతుంది. అప్పుడు ఈ రెండు జట్లు 12 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్టు టాప్ పొజిషన్‌కు చేరుకుంటుంది.