భారత అమ్మాయిలు అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో సునాయస విజయం సాధించిన షెఫాలి సేన ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న అండర్ 19 ప్రపంచకప్ కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. టాస్ గెలిచి కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేసింది. పర్షవి చోప్రా 3 వికెట్లు నేలకూల్చింది. కెప్టెన్ షఫాలి వర్మ నాలుగు ఓవర్లు వేసి..కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చింది.
T20 worldcup: కివీస్‌పై భారత్ ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన అమ్మాయిలు - మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లంది భారత జట్టు. శుక్రవారం జరిగిన సెమీస్‍లో న్యూజిలాండ్‍పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు మైదానంలో భారత అమ్మాయిలు చురుగ్గా కదలడంతో న్యూజిలాండ్ పరుగులు చేసేందుకు కష్టపడింది. భారత అమ్మాయిలు బౌలింగ్ దాడికి ఆరుగురు కివీస్ బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్ల రనౌట్‌గా వెనుదిరిగారు. కివీస్ బ్యాటర్ జార్జియా ప్లిమ్మర్ 35 పరుగులతో రాణించగా కివీస్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు కేవలం 14.2 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు షఫాలి వర్మ శ్వేతా సెహ్రావత్ భారత్‌కు శుభారంభం అందించారు. న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడి 3 ఓవర్లలోనే 30 పరుగులు జోడించింది. 10 పరుగులు చేసి షఫాలి వర్మ వెనుదిరిగినా శ్వేతా సెహ్రావత్ కివీస్ బౌలింగ్‌ను సునాయసంగా ఎదుర్కొని భారత్‌ను విజయం వైపు నడిపించింది. 45 బంతుల్లో 135 స్ట్రైక్ రేట్‌తో శ్వేతా 61 పరుగులు చేసింది. ఇందులో పది బౌండరీలు ఉన్నాయి. షెఫాలి తర్వాత వచ్చిన సౌమ్య 22 పరుగులతో రాణించింది. 95 పరుగుల వద్ద సౌమ్య అవుటైనా తెలుగుమ్మాయి గొంగడి త్రిష లాంఛనాన్ని పూర్తి చేసింది. జనవరి 29న అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.