ఓపెనర్లు షెఫాలీ వర్మ (96; 152 బంతుల్లో 13×4, 2×6), స్మృతి మంధాన (78; 155 బంతుల్లో 14×4) రాణించడం వల్ల ఇంగ్లాండ్ మహిళలతో ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో భారత్ పటిష్ఠంగా కనిపించింది. కానీ అనూహ్యంగా తడబడిన భారత్.. రెండోరోజు ఆట చివరికి 187/5తో కష్టాల్లో పడిపోయింది. మిథాలీ సేన 16 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది.
షెఫాలి తొలి వికెట్‌గా వెనుదిరిగిన వెంటనే మంధాన కూడా పెవిలియన్ చేరగా.. పూనమ్ రౌత్ (2), శిఖా పాండే (0), కెప్టెన్ మిథాలీరాజ్ (2) అలా వచ్చి ఇలా వెళ్లారు. హర్మన్‌ప్రీత్ (4), దీప్తిశర్మ (0) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 269/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను సోఫియా డంక్లీ (74 నాటౌట్), ష్రబ్‌సోల్ (47) మెరుగైన స్థితికి చేర్చారు. షబ్ర్‌సోల్ ఔట్ కాగానే.. ఇంగ్లాండ్ 396/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో స్నేహ రాణా (4/131), దీప్తిశర్మ (3/65) రాణించారు.